రుషికొండ రహస్యం బట్టబయలు: గాలి జనార్ధనరెడ్డిని తలపిస్తున్న ఫర్నిచర్!
మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన రుషి కొండ భవనాలు. కూటమి నేతలతో కలిసి భవనాల్లో కలియతిరిగిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. బదులిచ్చిన వైసీపీ.
కొంతకాలంగా తరచూ వార్తల్లో ఉంటున్న విశాఖ రుషికొండ ప్యాలెస్ రహస్యాన్ని భీమిలి కొత్త ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం బట్టబయలు చేశారు. గతంలో బళ్ళారిలో పారిశ్రామికవేత్త గాలి జనార్ధనరెడ్డి నిర్మించుకున్న భవనంలోని ఫర్నిచర్ స్థాయిలో ఉన్న రుషికొండ ప్యాలెస్ ఫర్నిచర్‌ను చూసి మీడియాతో సహా అందరూ ముక్కున వేలు వేసుకున్నారు.
రుషికొండ వివాదాల కొండ అన్న పేరు మోస్తోంది. ఎందుకంటే ఎప్పుడు ఈ పేరు వినిపించినా అది వివాదమే అయి ఉండటం. ఈ కొండను జగన్ తొలిచేసి పెద్ద రాజమహాల్ లాంటి ప్యాలెస్ కట్టుకున్నారని టీడీపీ వాళ్లు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. కానీ తాము అలా ఏం చేయలేదని, రిషికొండపై నిర్మించినవన్నీ అధికారిక భవనాలే అని వైసీపీ బదులు కూడా ఇచ్చింది. కానీ ఈ వ్యవహారం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. రుషికొండలో పర్యటించారు. ఈ సందర్బంగా పర్యటనకు సంబంధించిన ఫొటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇది కబ్జా కాదు
రుషికొండ విషయంలో వచ్చిన అన్ని ఆరోపణలను వైసీపీ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే వచ్చింది. ఈ భవనాలు అధికారికంగానే నిర్మించామని, విశాఖ అభివృద్ధిలో భాగంగా ఈ నిర్మాణాలు చేశామని వైసీపీ చెప్పుకొచ్చింది. అంతేకాకుడా అప్పట్లో సీఎంఓ కార్యాలయం సహా మరికొన్ని ఇతర ఆఫీసులను కూడా రుషికొండకు తరలిస్తారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో రెండో సారి గెలిచి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత రుషి కొండపై భవనాల వినియోగం గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని వైసీపీ నేతలు వెల్లడించారు. కానీ రుషి కొండ వివాదం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే కొనసాగుతుంది.
అంతా పరిశీలించిన ఎమ్మెల్యే
ఇప్పుడు అధికారం మారడంతో కొత్తగా గెలిచిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. కొండపై నిర్మించిన భవనాలను కలియతిరిగారు. తన అనుచరులు, మీడియాతో కలిసి భవనం మొత్తాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఈ భవనాలకు అనుమతులు ఉన్నాయా? లేదా? అన్న విషయాలపై కూడా గంటా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భవనానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు చూసిన వారంతా మహారాజు ప్యాలెస్‌కు ఈ భవనం ఏమాత్రం తీసిపోవదని కామెంట్లు పెడుతున్నారు.
రేకెత్తుతున్న అనుమానాలు..
ఒక్కసారిగా భీమిలి ఎమ్మెల్యే గంటా.. రుషికొండపై జరిగిన నిర్మాణాలను పరిశీలించడం, ఆయనతో పాటు కూటమి నేతలు పలువురు పాల్గొనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు వారు వీటిని పరిశీలించి ఏం చేస్తారు? ఉంచుతారా? తొలగిస్తారా? ఉంచితే ఈ భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుంది? లేదంటే ఏదైనా ప్రవేట్ హోటల్స్ వారికి లీజ్‌కు ఇచ్చే యోజనలో నేతలు ఉన్నారా? అన్న అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ రుషికొండపై కట్టిన భవనాల భవితవ్యం ఏంటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
స్పందించిన వైసీపీ
గంటా శ్రీనివాసరావు పర్యటన సందర్భంగా రుషి కొండ భవనాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై వైసీపీ స్పందించింది. అవన్నీ ప్రభుత్వ భవనాలే అని క్లారిటీ ఇచ్చింది. ‘‘అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు!’’ అని ఎక్స్(ట్వీట్) పెట్టింది.