
విజయవాడలో ’గద్దర్ బుక్ స్టాల్‘
శుక్రవారం ఘనంగా ప్రారంభమైన 36వ పుస్తక మహోత్సవం.
అక్షరానికి ఆయుధం పట్టి, పాటకు ప్రాణం పోసిన ప్రజాయుద్ధనౌక, దివంగత గద్దర్ సాహిత్యం ఇప్పుడు విజయవాడ పుస్తక ప్రియులను కట్టిపడేస్తోంది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన 36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో (Vijayawada Book Festival 2026) గద్దర్ సాహిత్య స్టాల్ (నెం. 160) ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సిమెంట్ కాంక్రీట్ వనాల మధ్య అక్షరాల పరిమళం వెదజల్లుతూ.. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఒక జ్ఞాన దేవాలయంగా మారింది. నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే 36వ విజయవాడ పుస్తక మహోత్సవం (Vijayawada Book Festival 2026) శుక్రవారం (జనవరి 2) ఘనంగా ప్రారంభమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ అక్షర యజ్ఞానికి అంకురార్పణ చేశారు. కేవలం వినోదమే కాకుండా విజ్ఞానాన్ని పంచే ఇలాంటి వేదికలు సమాజానికి దిక్సూచి అని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఒకవైపు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ఈ అక్షర యజ్ఞాన్ని ప్రారంభించగా, సందర్శకులు మాత్రం విప్లవ గీతాల సవ్వడి వినిపిస్తున్న గద్దర్ పుస్తక ప్రపంచం వైపు అడుగులు వేస్తున్నారు.
గద్దర్ సాహిత్యం: ఒక జ్ఞాపకం
పుస్తక ప్రదర్శనలో స్టాల్ నంబర్ 160 వద్ద గద్దరన్న స్వయంగా రాసిన గేయాలు, గీతాల సంకలనాలు కొలువుదీరాయి. గద్దరన్న కుమారుడు జి.వి. సూర్య కిరణ్ స్వయంగా స్టాల్ వద్ద ఉండి, తన తండ్రి జీవిత ప్రస్థానాన్ని, ఆయన రాసిన సాహిత్యంలోని లోతుపాతులను యువతకు, పుస్తక ప్రియులకు వివరిస్తున్నారు. అరుదైన పుస్తకాలు అంటే గద్దర్ జీవన పోరాటంపై వివిధ రచయితలు రాసిన వ్యాసాలు, సామాజిక విశ్లేషణలతో పాటు బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ సిద్ధాంత గ్రంథాలు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రముఖుల సమక్షంలో అక్షరార్చన
బి.వి. పట్టాభిరామ్ సాహిత్య వేదికపై జరిగిన ప్రారంభోత్సవంలో పలువురు మేధావులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ మాట్లాడుతూ, పుస్తకాలు మనిషిని సంస్కరిస్తాయని, విజయవాడ బుక్ ఫెస్టివల్ ఒక సాంస్కృతిక వారధి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, సీపీఐ నేత నారాయణ, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తక మేళా విశేషాలు
ప్రాంగణాల పేర్లు: ప్రదర్శన ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి పేరు, ప్రధాన వేదికకు బి.వి. పట్టాభిరామ్, ప్రతిభా వేదికకు ఖగోళ శాస్త్రవేత్త జయంత్ నార్లీకర్ పేర్లను పెట్టి గౌరవించారు. మొత్తం 300 పైగా స్టాళ్లతో జనవరి 12 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. అన్ని పుస్తకాలపై 10 శాతం రాయితీ లభిస్తుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్టాల్స్ ఓపెన్ లో ఉంటాయి.
డిజిటల్ యుగంలోనూ తగ్గని ఆదరణ
టెక్నాలజీ పెరిగినా, పేజీలు తిరగేస్తూ పుస్తకాన్ని చదివే అనుభూతి వేరని తొలిరోజే తరలివచ్చిన పుస్తక ప్రియులు నిరూపించారు. ముఖ్యంగా గద్దర్ వంటి ప్రజా కవుల సాహిత్యం నేటి తరానికి సామాజిక చైతన్యాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

