
'గ్రామీణ పేదల పొట్టకొట్టడమే ‘ జీ-రామ్ -జీ’ లక్ష్యం'
చంద్రబాబు సర్కారుది మొసలి కన్నీరు అంటున్న కౌలురైతుల సంఘం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్తానంలో విబి-రామ్- జి పేరుతో మరో పథకాన్ని తీసుకు రావడం, గ్రామీణ పేదల ఉపాధి గండిగొట్టే విధంగా నూతన బిల్లులో నిబంధనలు పొందుపరచడం గ్రామీణ పేదల పట్ల కేంద్ర ప్రభుత్వ వర్గ స్వభావం ఏమిటో తేటతెల్లమౌతున్నది. చట్టం మౌలిక స్వభావాన్ని మార్చి ఊపిరి తీసింది ఈ సరికొత్త బిల్లు. ఈ బిల్లును వ్యతిరేకించాల్సింది పోయి రాష్ట్రంలోని కూటమి సర్కారు సమర్ధించడం బాధాకరం. పైగా ముసలికన్నీరు కారుస్తున్నది. అనేక ఏళ్ల పాటు గ్రామీణ పేదలు వామపక్షాల సహాకారంతో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచింది. సవరణల పేరుతో గ్రామీణ ప్రజల జీవనాడీగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేసింది. ఈ చర్య గ్రామీణ పేదలకు, ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల జీవనోపాధికీ తీవ్ర నష్టం. ఈ విధానాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యగా భావించాలి.
20 ఏళ్ల (2005)నుంచి అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం’’ విబి రామ్ జి’’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని పని హక్కు నుండి జీవనోపాధి, ఆస్తుల కల్పన వైపు తీసుకు వెళ్ళతామని చెబుతోంది. దీని లక్ష్యం ఏమిటంటే 2047 నాటికి వికసిత భారత్ సాధనలో భాగంగా గ్రామీణ మౌలిక వసతులను బలోపేతం చేయాలని పేర్కొంది.
ఈ కొత్త పథకానికి ప్రతి ఏడాది రూ.1.51 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. ఏడాదికి 125 రోజులు పని దినాలను కల్పిస్తామని చెబుతున్నది. పనిచేసిన 15 రోజుల్లో వేతనం చెల్లించాలని, ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కూడా వర్తిస్తుందని పేర్కోంది. గత పథకంలో మొత్తం నిధులల్లో కేంద్ర 90శాతం,రాష్ట్ర ప్రభుత్వాలు 10శాతం కేటాయింపులు ఉండేవి. ప్రస్తుతం నిధులు కేటాయింపు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40% ఉండాలని పేర్కొంది. వేతనాలు చెల్లింపుల్లో గతంలో కేంద్ర ప్రభుత్వమే 100శాతం వేతనాలు భరించేది.
ఇప్పుడు రాష్ట్రాలు 40 శాతం భరించాలని నిబంధనలు చేర్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పనులను నాలుగు రకాలుగా వర్గీకరించారు.
నీటి భద్రత అంటే చెరువులు, కుంటలు నిర్మాణం చేయాలని,
గ్రామీణ మౌలిక వసతులు ఏర్పాటు కోసం గ్రామీణ రోడ్లు, భవనాలు నిర్మించాలని,
జోనోపాధి నిమిత్తం పశువుల షెడ్లు, గోడౌన్లు నిర్మాణం చేయాలని,
విపత్తుల నియంత్రణ కోసం ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా నిర్మాణాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
పై అంశాలను పరిశీలిస్తే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ పథకానికి నిధులు తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రారంభ దినాల్లో కేంద్ర బడ్జెట్లో 4 శాతం పైగా నిధులు కేటాయిస్తే క్రమక్రమంగా తగ్గించుకుంటూ 1.3% కుదించారు.
ఈ అనుభవాన్ని చూస్తే ఈ పథకాన్ని మరింత అభివృద్ధి చేస్తారా అనే అపనమ్మకం కలుగుతోంది. నిధులు ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు సమకూర్చాలని పేర్కొనటం అంటే ఈ పథకాన్ని బుట్ట దాఖలు చేయడమే అవుతుంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఆదాయాలను కేంద్ర ప్రభుత్వం గండి కొడుతున్నది.
ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చి ఖర్చు చేయాలని చెప్పటం రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారుతుంది. లోటు బడ్జెట్లతో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు పెనుభారం అవుతుంది. రాష్ట్రాలు గతంలో లాగా తగిన శ్రద్ధ చూపించకపోవచ్చు. దీంతో ఈ పథకం కుదించుకు పోతుంది. గతంలో వంద రోజులు పని దినాలు కల్పించాలని చట్టంలో ఉన్నప్పటికీ ఏ రోజు కూడా ఉపాధి హామీ కూలీలకు వంద రోజులు పని కల్పించలేకపోయారు. ఇప్పుడు 125 రోజులు పెంచుతామని నిర్ణయించడం చెప్పటానికి సబూబుగానే ఉంది కానీ నిధులు తగ్గిపోతే పని దినాలు పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మేరకు నిధులను సమకూర్చలేని సందర్భంలో పనిరోజులు పెంచినా ఫలితం ఉండదు.
ఎద్దుకు చిక్కం కట్టి మేత వేస్తే తినలేదు అలాగనే నిధులు తగ్గించుకుంటూ పోతూ రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపుతూ పని దినాలు పెంచడం అంటే హాస్యస్పదంగానే ఉంటుంది. ఇది పెద్ద దాగాలా ఉంది. జాబ్ కార్డులు కల్గిన కూలీలు పని కల్పించాలని దరఖాస్తులు పెట్టిన సందర్భంలో పని కల్పించకపోగా ఇంతవరకు నిరుద్యోగ భృతి కల్పించిన దాఖలాలు ఎక్కడా లేవు. పారదర్శకత కోసం బయోమెట్రిక్, జియో టాకింగ్ తప్పనిసరి చేశారు.
అంతేకాకుండా డేటా ఆధారిత ప్లానింగ్ డిజిటల్ చెల్లింపులు చేస్తామని చెబుతున్నారు. ఒక పేదవాడు బ్రతకటానికి పని కల్పించమని అడిగినందుకు టెక్నికల్ అంశాలతో పని దినాలు కోత పెట్టె పరిస్థితి కూడా కనపడుతుంది. ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో పేదలకు అదనంగా 25 రోజులు ఆదాయం లభించటం ఊరటని చెబుతుంది.
ప్రతిరోజు నిత్యవసర వస్తువులు ధరలు పెరిగిపోయి జీవించటమే కష్టంగా మారినటువంటి పరిస్థితుల్లో పెంచిన 25 రోజుల పని దినాలు ఏమాత్రం చాలావు. పైగా 25 రోజులు కచ్చితంగా పని కల్పిస్తారని గ్యారెంటీ ఏమి ఈ పథకంలో లేదు. 60 రోజులు వ్యవసాయ విరామం ప్రకటిస్తామని చెబుతుంది. ఇది రైతులకు పెద్ద వరం అనే పేర్కొంది. వ్యవసాయ పనులకు కూలి దొరకటం లేదని,కూలీరేట్లు పెరిగాయని రైతులు ఫిర్యాదు చేసే అవకాశం లేదని ఖరాఖండిగా చెబుతున్నారు.
ఈ 60 రోజులు గ్యాప్ వల్ల రైతులకు కూలీలు అందుబాటులో ఉంటారని చెప్పటం వాస్తవం కాదు. పేదలకు డబ్బు అవసరమనేది సీజన్ బట్టి రాదు. ఒకవేళ ఆ సీజన్లో వ్యవసాయ పనులు దొరక్కపోతే అంటే కరువు కాటకాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే వారి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. నీటి భద్రత,గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి వసతులు, విపత్తుల నియంత్రణ కొరకు నిధులు వెచ్చించే విధంగా పనులు చేపట్టాలని చెప్పటం కొత్తవి ఏమి కాదు గతంలో కూడా ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణం చేపట్టినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇందులో ప్రధానమైన లోపం ఏంటంటే నిర్వహణ బాధ్యతనుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవడం. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి భాద్యతగా ఉండేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై పూర్తి బాధ్యతను, జవాబుదారీతనాన్ని ఉంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం పరిరక్షణ మాత్రం చేస్తానని చెప్పటం ఈ పథకానికి భవిష్యత్తులో పాతర వేయటమే అవుతుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం దెబ్బతీస్తుంది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహమీ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రత పథకం. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమలకు ఉద్దేశించినది. ఆర్టికల్ 41 పని హక్కు ,ఆర్టికల్ 21 గౌరమైన జీవనం గడపాలనే ఉద్దేశించి చట్టం తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పని హక్కు కల్పించడం దీని ప్రధానం లక్ష్యం. ఈ పథకం మౌలిక సూత్రమైన పని కల్పించమని హక్కును లేకుండా చేయటమే నూతనంగా తీసుకువచ్చిన బిల్లు సారాంశం.
పైగా పేరు మార్చడం అంటే మహాత్మాగాంధీ పేరు వినడానికి కూడా ఇష్ట పడడంలేదని మోదీకి అనిపిస్తుంది. ఈ చర్య బిజెపి ఫాసిస్టు దోరణకి అర్థం పడుతుంది. మహాత్మాగాంధీ విలువలకు, వారి వారసత్వాన్ని నామ రూపాలు లేకుండా చేయాలనే పెద్ద కుట్ర ఇందులో దాగి ఉంది. మహాత్మా గాంధీ పేరు మార్చడం ద్వారా గ్రామీణ పేదల మెదడులోకి మతతత్వ వాదాన్ని తీసుకు వెళ్ళె దుర్భిద్ది కనపడుతున్నది. ఏ రకంగా చూసిన నూతనంగా తీసుకువచ్చిన ఈ చట్టం గ్రామీణ పేదలకు, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకమైనది. ఫెడరల్ విధానానికి నష్టదాయాకం. నూతన చట్టం తీసుకు రావడమే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన చర్య. ఇప్పటికైనా ఈ పథకాన్ని పున పరిశీలించి పునధ్దరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుసంఘం డిమాండ్ చేస్తోంది.
(వ్యాస రచయిత- పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుసంఘం)
Next Story

