
రాష్ట్రపతి చేతిలో బీసీ రిజర్వేషన్ బిల్లు భవిష్యత్తు
కొద్దిరోజులు తీర్మానాన్ని తనదగ్గరే పెట్టుకున్న గవర్నర్ ఈమధ్యనే రాష్ట్రపతి నిర్ణయానికి పంపించారు.
ఇపుడు మొత్తం తెలంగాణ చూపంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వైపే ఉందా ? సుప్రింకోర్టు తాజా ఆదేశాలను గమనిస్తే అందరు అవుననే అంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రాల గవర్నర్లు పంపించిన ఎలాంటి బిల్లయినా సరే రాష్ట్రపతి గరిష్టంగా మూడునెలల్లోనే సమాధానం పంపాలని సుప్రింకోర్టు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. బిల్లును ఆమోదించచ్చు, తిరస్కరించవచ్చు, వివరణకోరుతు బిల్లును తిప్పిపంపవచ్చు లేదా సలహా కోరుతు న్యాయనిపుణులకు సదరు బిల్లును పంపవచ్చు. ఈ నాలుగింటిలో ఏదో ఒకదానిని రాష్ట్రపతి మూడునెలల్లోనే చేసేయాలి. పై నాలుగింటిలో రాష్ట్రపతి ఏమీచేయకపోతే సదరు బిల్లు భవిష్యత్తు ఏమిటనే విషయాన్ని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పలేదు. కాకపోతే రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే అదే విషయమై రాష్ట్రప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేయవచ్చని చెప్పింది.
సుప్రింకోర్టు తాజాతీర్పు తెలంగాణ(Telangana)కు కూడా వర్తిస్తుందనటంలో సందేహంలేదు. ఇపుడు విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఈమధ్యనే బీసీలకు విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలుచేయాలని అసెంబ్లీలో తీర్మానంచేసింది. ఆ తీర్మానాన్ని ఆమోదంకోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపింది. కొద్దిరోజులు తీర్మానాన్ని తనదగ్గరే పెట్టుకున్న గవర్నర్ ఈమధ్యనే రాష్ట్రపతి నిర్ణయానికి పంపించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్(BC Reservations) కల్పించే బిల్లు ఇపుడు రాష్ట్రపతి పరిశీలనలోఉంది. సుప్రింకోర్టు తీర్పుప్రకారం బిల్లును రాష్ట్రపతి మూడునెలలకు మించి తన దగ్గర పెట్టుకునేందుకు లేదు. ఈనేపధ్యంలోనే సదరుబిల్లుపై రాష్ట్రపతి ముర్ము(President Draupadi Murmu) ఏమి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి పెరిగిపోతోంది. అందుకనే పార్టీలన్నీ ఇపుడు రాష్ట్రపతి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి.
కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం బిల్లును రాష్ట్రపతి న్యాయసమీక్షకు లేదా మరిన్ని వివరాలు కోరుతు తిప్పి రాష్ట్రప్రభుత్వానికే పంపే అవకాశముంది. కారణం ఏమిటంటే స్ధానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని గతంలో సుప్రింకోర్టు(Supreme Court) తీర్పిచ్చింది. ఆ తీర్పుప్రకారం చూస్తే తెలంగాణలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. ఈరెండు సామాజికవర్గాలకు 25 శాతం రిజర్వేషన్ అమలుచేయక తప్పదు. ఈ 25శాతానికి బీసీలకు వర్తింపచేయాలని అనుకుంటున్న 42 శాతాన్ని కలిపితే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతుంది. సుప్రింకోర్టు చెప్పిన ప్రకారమైతే 50 శాతంకు మించి అదనంగా 17 శాతం రిజర్వేషన్ అమలుచేయటం సాధ్యంకాదు. అందుకనే బీసీ42 శాతం బిల్లును రాష్ట్రపతి న్యాయసమీక్షకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉందని సమాచారం.
స్ధానికసంస్ధల్లో బీసీలకు తమిళనాడులో(Tamil Nadu) 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అయితే 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదన్న విషయంలో తమిళనాడు ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రింకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఆ పిటీషన్లను సుప్రింకోర్టు విచారిస్తోంది. కాబట్టి తెలంగాణలో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయిస్తే వెంటనే ఎవరైనా సుప్రింకోర్టులో కేసులు వేసే అవకాశముంది. అందుకనే ఈ బిల్లును రాష్ట్రపతి న్యాయసమీక్ష కోరే అవకాశముందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. క్షేత్రస్ధాయిలోని రాజకీయ పరిస్ధితుల ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని ఎవరూ అనుకోవటంలేదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అనుకూలంగా చేసిన నిర్ణయానికి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సానుకూలంగా ఎందుకుంటుంది ?
అందుకని ఈబిల్లుకు రాష్ట్రపతి భవన్లో ఇప్పుడిప్పుడే మోక్షంలభించదని చాలామంది అనుమానించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తమిళనాడు కేసు నేపధ్యంలో సుప్రింకోర్టు తీర్పు, వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లుపైన రాష్ట్రపతి మూడునెలల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని తీరాలి. లేకపోతే రాష్ట్రపతి వైఖరికి వ్యతిరేకంగా రేవంత్ ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పొన్నం ఆశాభావం
ఇదే విషయమై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతు బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించిన బిల్లుకు రాష్ట్రపతి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించటం చారిత్రాత్మకమని మంత్రి అభివర్ణించారు. బీసీల జనాభా 50శాతంకు మించి ఉందన్న విషయం కులగణలో తేలిన కారణంగానే ప్రభుత్వం విద్య, ఉద్యోగాలతో పాటు స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు మంత్రి తెలిపారు.
అమలు గ్యారెంటీలేదు
బీసీల రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ ప్రభుత్వం కోరుతున్నట్లు కేంద్రప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చినా న్యాయసమీక్ష ముందు నిలబడుతుందన్న గ్యారెంటీలేదని మాజీ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన కే రామకృష్టారెడ్డి అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల శాతం రాజ్యాంగ మౌలికసర్వూపానికి విరుద్ధంగా ఉంటే న్యాయసమీక్ష చేయవచ్చని తమిళనాడు విషయంలో స్పష్టమైందన్నారు. తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అమలవుతాయని చెప్పేందుకు లేదన్నారు. మరో మాజీ అడ్వకేట్ జనరల్ బీ శివానంద ప్రసాద్ మాట్లాడుతు తెలంగాణ రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి అటార్నీ జనరల్ అభిప్రాయం కోరే అవకాశాలు ఎక్కువగా ఉందన్నారు. అలాగే సుప్రింకోర్టు సలహా కోరే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.