మహానాడుకు పకడ్బందీ ఏర్పాట్లు
x

మహానాడుకు పకడ్బందీ ఏర్పాట్లు

పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.


కడపలో మహానాడు ఏర్పాట్లపై మంత్రులు, సీనియర్‌ నేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లపై పొలిట్‌ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా పలవురు మంత్రులు, సీనియర్‌ నేతలకు బాధ్యతలు అప్పగించారు. బుధవారం సాయంత్రం టీడీపీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. అన్న ఎన్టీఆర్‌ గారి దగ్గర నుంచి పండుగ వాతావరణంలో మహానాడును నిర్వహించడం జరుగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడును నిర్వహించాం. గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు.

అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుగులేని మెజార్టీ సాధించాం. వసతి, రవాణకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు. మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చ జరగనుంది. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంట్‌ స్థాయి మహానాడు, నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమాల నిర్వహణపైనా కూడా లోకేష్‌ ఈ సమావేశంలో చర్చించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఎస్‌.సవిత, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు సీనియర్‌ నేతలు బీద రవిచంద్ర యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, దామచర్ల సత్య, రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, వీరంకి వెంకట గురుమూర్తి, మంతెన రామరాజు, సి.భూపేష్‌ రెడ్డి, ఎమ్మెల్యేల జ్యోతుల నెహ్రూ, ఆర్‌.మాధవి రెడ్డి, జీవీ ఆంజనేయులు, మంతెన సత్యనారాయణ రాజు, చింతకాయల విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story