
కేంద్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం హామీ నెరవేర్చండి
కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయండి అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయం-అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా కేంద్రం మరింతగా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డుతో సహా వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం–2014, షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి రూ.2,585 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి సమర్పించినట్లు చెప్పారు.
ఉత్తమ విధానాలతో వృద్ధి సాధించాం
మరోవైపు రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, అన్నదాతల సంక్షేమానికి తీసుకున్న చర్యలను, అనుసరిస్తున్న విధానాలను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. వ్యవసాయం-అనుబంధ రంగాల్లో 10.70 శాతం వృద్ధి నమోదు చేసినట్టు తెలిపిన ముఖ్యమంత్రి... ఇందుకోసం పంచ సూత్రాల ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
వ్యవసాయాభివృద్ధికి సహకరించాలంటూ చేసిన వినతులివే..
అమరావతి పర్యటనలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్యమంత్రి ఈ మేరకు వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి అగ్రికల్చర్ యూనివర్శిటితో సహా సీఎం సమర్పించిన వినతి పత్రంలో అంశాలివే...
• పీఎం ఆర్కేవీవై-పీడీఎంసీ పథకం కింద సూక్ష్మ సాగునీటి విస్తరణకు అదనంగా రూ.695 కోట్లు కేటాయించాలి.
• అరటి పంట రవాణాలో నష్టాలు తగ్గించేందుకు, మార్కెట్ యాక్సెస్ పెంచేందుకు రైల్వే వ్యాగన్ల ద్వారా అరటి రవాణాకు సబ్సిడీ కల్పించాలి.
• కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.200 కోట్ల అంచనా వ్యయంతో కొబ్బరి పార్క్ ఏర్పాటుకు అనుమతి.
• పట్టు పురుగుల పెంపకం షెడ్లకు 2025–26 నుంచి నిలిచిపోయిన ‘వీబీ జీ రామ్ జీ’ కింద సాయం.
• ప్రకృతి సాగులో శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించాలి.
• పీఎం-ప్రణామ్ కింద నిధుల విడుదలను వేగవంతం చేయాలి.
• ఎన్ఎంఎన్ఎఫ్ 2026–27 సంవత్సరానికి 10,000 సహజ సాగు క్లస్టర్లకు అనుమతి ఇవ్వాలి.
• 2025–26లో మంజూరైన 5,000 క్లస్టర్ల నిర్వహణ ఖర్చులు కేంద్రం భరించాలి.
• రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రైతులు సహజ సాగు అమలు చేస్తున్న నేపథ్యంలో, వచ్చే ఐదేళ్లలో 20,000 అదనపు క్లస్టర్ల కేటాయించాలి.
• ఆంధ్రప్రదేశ్‌ను సహజ సాగుకు జాతీయ వనరుల రాష్ట్రంగా ప్రకటించాలి.
• విజయవాడ, అమరావతిలో అత్యాధునిక ఆక్వా ల్యాబ్ ఏర్పాటు చేయాలి.
• పులికాట్ సరస్సు అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చాలి.
• ఆపరేషన్ గ్రీన్స్ కింద ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న రూ.19.05 కోట్ల నిధుల విడుదల చేయాలి.
• ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్లకు అనుమతులివ్వాలి.
• ఎన్ఐఎఫ్‌టీఈఎం ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలి.
• ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 20 మిలియన్ కిలోల హెచ్డీ బర్లీ పొగాకు సేకరణకు రూ.150 కోట్ల సాయం చేయాలి.
• రాష్ట్రంలో మ్యాంగో బోర్డు, ఐసీఏఆర్ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటుకు అనుమతివ్వాలి.
•ఎన్ఎఫ్‌డీబీ అమరావతికి తరలించాలి.
•పీఎంఎంఎస్‌వై కింద సబ్సిడీ 60 శాతానికి పెంచాలి.
•అమరావతిలో అఖిల భారత రొయ్యల సమాఖ్య ఏర్పాటు చేయాలి.
Next Story

