
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి గంజాయి స్మగ్లర్‌గా..
మహిళా టెక్కీతో సహా ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనకాపల్లి జిల్లా నాతవరం పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. శుక్రవారం జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయిని తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తూ ఆ ఉద్యోగాలను వదిలేసిన వాళ్లు, బాగా చదువుకున్న వాళ్లు ఉండటం గమనార్హం. ఈ కేసు వివరాలను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు.
సులభంగా డబ్బు సంపాదించాలని
ఈ ముఠాలో అందరినీ విస్మయానికి గురిచేస్తున్న అంశం ఏమిటంటే.. అరెస్ట్ అయిన వారిలో ఒకరు ఉన్నత విద్యావంతురాలు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మాడుగులపేట గ్రామానికి చెందిన గాది రేణుక బీటెక్ పూర్తి చేసి, గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కూడా చేశారు. అయితే, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణా బాట పట్టినట్లు పోలీసులు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
నిందితుల నుంచి పోలీసులు ఈ క్రింది వాటిని స్వాధీనం చేసుకున్నారు.
-74 కిలోల గంజాయి
-ఒక కారు
-రెండు ద్విచక్ర వాహనాలు
వీటి మొత్తం విలువ సుమారు రూ. 33 లక్షలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు.
అరెస్టయిన నిందితుల వివరాలు
పోలీసుల సమాచారం ప్రకారం అరెస్టయిన వారిలో
- గాది రేణుక (విజయనగరం జిల్లా)
- సూర్య కాళిదాసు మదన్ కుమార్ (తమిళనాడు)
- ముత్తు (తమిళనాడు)
- పడ్డూరి ప్రసాద్ (కొత్తకోట, రావికమతం మండలం)
- అండెంగుల రవికుమార్ (గుత్తలతపుట్టు, పాడేరు మండలం)
- లలిత కుమారి (లోతుగడ్డ జంక్షన్, చింతపల్లి మండలం)
- పొన్నగంటి మణికుమారి (పెదవలస, జీకే వీధి మండలం) ఉన్నారు.
నాతవరం ఎస్సై తారకేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యావంతులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం పట్ల పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story

