
దుగ్గిరాల వీర్లపాలెంలో ఆర్జీఎల్-7034 వరి సాగు
తుపాన్లకూ తలవంచని వరి వంగడం-RGL 7034
ఎన్జీరంగా అగ్రీ యూనివర్శిటీ శాస్త్రవేత్తల అద్భుతం- రాగోలు వరి వంగడం
బంగాళాఖాతంలో అల్పపీడనమంటే ఆంధ్రప్రదేశ్ రైతుల్లో గుండెదడే. ప్రత్యేకించి తీర ప్రాంతంలోని వరి సాగుచేసే రైతుల పరిస్థితైతే ఇక చెప్పాల్సిన పనేలేదు. ఏవైపు నుంచి ఏం ముంచుకొస్తుందో తెలియని దుస్థితి.. ఇకపై ఆ భయం, ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు.
శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా శ్రమపడి తుపాను ప్రాంతాల్లో నిలబడగలిగే వరి వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఆ కృషి ఫలితమే ఆర్‌జీఎల్ 7034 (RGL 7034). డాక్టర్ పీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం ఈ వంగడాన్ని రూపొందింది.
తుపాన్లను తట్టుకునే రకంగా దీన్ని అభివర్ణిస్తున్నారు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇది విపత్తులను జయిస్తుందని అంచనా. తుపాన్లు, ఈదురు గాలుల్ని తట్టుకుని దిగుబడిని ఇస్తుంది. బీపీటీలను తలపిస్తుంది అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.
చిట్టి ముత్యాల వరి వంగడంతో ఎన్ఎల్ఆర్ 34449 రకాన్ని సంకరం చేసి ఆర్జీఎల్ 7034 రకాన్ని రూపొందించారు. దీని పంట కాలం 140 రోజులు. సన్నబియ్యంగా చెప్పే బీపీటీలకన్నా ఎక్కువ దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 42 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. బీపీటీలకన్నా ఇది కనీసం పది బస్తాలు ఎక్కువ.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత రైతులకు ప్రతి ఏటా తుపాను, ఈదురు గాలులు వెంటాడుతుంటాయి. ఒక్కరోజు గాలి–వానతో నెలల తరబడి శ్రమించిన వరి పంట నేలమట్టమవుతోంది. ఇలాంటి సమస్యకు పరిష్కారమే RGL 7034 వరి వంగడం. పంట ప్రయోగం సక్సెస్ అయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విత్తనోత్పత్తి కోసం పంటను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.
దీని ప్రత్యేక లక్షణాలు ఇలా...
తక్కువ ఎత్తు, బలమైన కాండం
తుపాన్లలోనూ మొక్క పడిపోకుండా నిలబడే లక్షణం
దేశవాళి చిట్టిముత్యాల రకంతో ప్రత్యేక క్రాస్
దిగుబడి BPT ల కంటే ఎక్కువ
ఎకరానికి 45 బస్తాల వరకూ
పంటకాలం 140–145 రోజులు
ఎకరా సాగుకు అయ్యే ఖర్చు- సుమారుగా రూ.25 వేలు
సాధారణ వరి సాగుతో పోలిస్తే ₹10 వేల వరకు ఖర్చు తక్కువ
తెగుళ్లను తట్టుకునే శక్తి..
ఈ కొత్త వంగడం పట్ల పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం, కొరంగుడిపాడు గ్రామానికి చెందిన వేమూరి అజయ్ కుమార్ తన అనుభవాన్ని వివరించారు. ఇది 145 రోజుల పంట. రాగోలు సెంటర్‌లో అభివృద్ధి చేసిన చాల బలమైన వంగడం. చిట్టిముత్యాల రకంతో క్రాస్ కాబట్టి cooking quality చాలా బాగుంది.
పడిపోకుండా నిలబడుతుంది. దిగుబడి అద్భుతం వచ్చింది. వ్యవసాయ శాస్త్రవేత్త పాలడుగు సత్యనారాయణ ఇచ్చిన భరోసాతో మేము ఇక్కడ సాగు చేస్తున్నాం. విత్తనోత్పత్తి పూర్తయ్యాక రైతులకు అందజేస్తామని, మార్కెట్ డిమాండ్ కూడా బాగుంటుందని ఆయన తెలిపారు. ఏదైనా వివరాలు కావాల్సి వస్తే ఈ నెంబర్ కు కాల్ చేయవచ్చునని ఆయన తన నెంబరు 9390551334 ఇచ్చారు.
ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న మరో రైతు ఏమంటున్నారంటే తీరప్రాంతాలకు ఈ వరి వంగడం చాలా విలువైందన్నారు. ఆళ్ల మోహన్ రెడ్డి అనే ఈ రైతుది గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామం. వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రతి కొత్త వంగడాన్నీ ఈయన తన పొలంలో సాగు చేస్తుంటారు. ఇప్పుడు RGL 7034 రకాన్ని కూడా సాగు చేశారు.
ఇటీవలి మొంథా తుపాను సమయంలో తన చుట్టుపక్కల వారి చేలల్లోని వరి పంట నేలమట్టం కాగా ఈయన చేలో మాత్రం వరి అలాగే నిలిచి ఉంది. దీనికి కారణం ఈ RGL 7034 రకాన్ని సాగు చేయడమే. అందరూ వచ్చి చూసి విస్తుపోయారు కూడా.
వ్యవసాయ నిపుణుల అంచనా ప్రకారం RGL 7034 వచ్చే 5–10 ఏళ్లలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత ప్రాధాన్యమైన వరి రకమవుతుంది. రాగోలు పరిశోధనా కేంద్రం దీన్ని హైబ్రీడ్ లైన్లుగా విస్తరింపజేయడానికి సిద్ధమవుతోంది.
డాక్టర్ టీవీ సత్యనారాయణ మాటల్లో RGL 7034 వంగడం చిరకాల సమస్యకు శాస్త్రీయ పరిష్కారం. తుపానులు ఇప్పుడు మరింత తరుచుగా వస్తున్నాయి. తీరప్రాంత రైతులు వరి సాగు చేయకుండా ఉండలేరు. అందుకు ఈ వంగడం సరైన పరిష్కారం. ఇది రైతులకు పెద్ద వరంగా మారుతుంది.
ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయో చెప్పలేం గాని మా పరిశోధనలు మాత్రం రైతు గుండెల్లో ధైర్యం నింపగలవు అన్నది డాక్టర్ సత్యనారాయణ నిశ్చితాభిప్రాయం. ఈ వంగడం ఇప్పుడు ఆంధ్ర రైతుల జీవనంలో కొత్త ఆశ.
Next Story

