
శ్రీలక్ష్మీ, బీపీ ఆచార్య, ధనుంజయరెడ్డి, సీతారామాంజనేయులు
ఆంధ్రాలో జైళ్ల పాలు అవుతున్న ఐఎఎస్, ఐపిఎస్ లు
ఆవేళ శ్రీలక్ష్మీ, బీపీ ఆచార్య, ఇవాళ ధనుంజయరెడ్డి, సీతారామాంజనేయులు.. నాడు తండ్రి వైఎస్ వల్ల, ఇపుడు కొడుకు జగన్ వల్ల.. జైళ్ల పాలవుతున్న ఐఎఎస్ లు, ఐపీఎస్ లు
చరిత్ర పునరావృతమైంది. ప్రతికార రాజకీయాలతో అట్టుడుకుతున్న ఆంధ్రప్రదేశ్ లో అత్యున్నత ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఇతర ఉన్నతాధికారుల వేట కొనసాగుతోంది. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ అరెస్టులన్నింటా అధికారంతో ముడిపడిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. చిత్రంగా ఇప్పుడు గాని ఇంతకు ముందు గాని అరెస్ట్ అయిన అధికారగణంలో ఎక్కువ మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అనుబంధం ఉన్న వారే.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన లావాదేవీలకు సంబంధించి జగన్ పై సీబీఐ, ఈడీ దర్యాప్తులు సాగుతున్నాయి. ఆవేళ అధికార పీఠానికి దగ్గరగా ఉన్నవారు అరెస్ట్ అయితే ఈవేళ కూడా అధికారంలో ఉన్న వారితో సహకరించిన వారే అనే ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని, ఆయన కుమారుడు వైఎస్ జగన్ ను సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్, ఐపీఎస్‌లు, రాజకీయ అనుచరులపై దృష్టి కేంద్రీకృతమైంది. తేడా అంతా ఆ రోజు వాళ్ళు సర్వీస్ లో ఉన్నారు. ఈరోజు ధనుంజయ్ రిటైర్ అయ్యారు.
2004-2009 మధ్యకాలంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 26 ప్రాజెక్టులకు సంబంధించిన ఉత్తర్వులు, ఆదాయానికి మించిన ఆస్తులు తల నొప్పులు తెచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి ఆరోపణలతోనే బ్యూరాక్రాట్లు అరెస్ట్ అవుతున్నారు.
2004–2009 మధ్య కాలంలో జగన్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు ప్రోత్సాహక ఉత్తర్వులు జారీ చేసినందుకు సంబంధించి సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న వారిలో పలువురు ఐఎఎస్ లు ఉన్నారు. వారిలో సీవీఎస్కే శర్మ, ఎస్వీ ప్రసాద్, వై.శ్రీలక్ష్మీ, బి.శ్యాంబాబు, కె.రత్నప్రభ, ఆదిత్యనాథ్ దాస్, పి.శామ్యూల్, మన్మోహన్ సింగ్, బీపీ ఆచార్య ఉన్నారు. వారిలో ఇద్దరు- వై.శ్రీలక్ష్మీ, బీపీ ఆచార్య- జైలుకి వెళ్లి వచ్చారు. Y. Srilakshmi (IAS) నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ లీజులు ఇచ్చారన్న ఆరోపణపై అరెస్ట్ అయ్యారు. ఇండస్ట్రీస్ & మైన్స్ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు అక్రమ లైసెన్సులు మంజూరు చేశారనే దానిపై ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ కేసు విచారణ జరుగుతోంది. B.P. Acharya (IAS) ఇఎమ్మార్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయించారనే ఆరోపణపై అరెస్ట్ అయ్యారు. విదేశీ సంస్థకి అనుకూలంగా భూముల కేటాయింపులో కీలక పాత్ర పోషించారన్నది ఆరోపణ. Mopidevi Venkataramana (మాజీ మంత్రి) Vanpic project లో అక్రమ లాభాల కేసులో అరెస్ట్ అయ్యారు. Guntur–Prakasam జిల్లాల్లో పోర్టు అభివృద్ధి పేరుతో వాన్ పిక్ సంస్థకు భూములు కట్టబెట్టారన్నది ఆరోపణ.
ఆ సమయంలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు (Disproporationate Assets Case) సమకూర్చుకున్నారన్న ఆరోపణపై అరెస్ట్ అయ్యారు. ఇప్పుడా కేసుల విచారణ కొనసాగుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తరువాత కొన్ని అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. వాటిలో ప్రధానమైంది ఏపీ లిక్కర్ స్కాం. ఈ కేసులో వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి, జగన్ కి ఒఎస్డీగా పని చేసిన ఆర్డీవో స్థాయి అధికారి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసును టీడీపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారిస్తోంది.
ఇక మరో కేసులో ఐదుగురు ఐపీఎస్ లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ కేసే ముంబాయి కి చెందిన నటి జెత్వానీకి సంబంధించింది. ముంబైకి చెందిన నటి కదంబరి జెఠ్వానీపై అక్రమ అరెస్టు, వేధింపుల కేసులో పి.సీతారామాంజనేయులు అనే మాజీ ఐపీఎస్ అధికారి 2024 సెప్టెంబరులో సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. కాంతి రాణా టాటా (Kanthi Rana Tata, IPS – 2004 బ్యాచ్) విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో కదంబరి జెత్వానీ కేసులో 2024 సెప్టెంబరులో సస్పెండ్ అయ్యారు. విశాల్ గున్ని (Vishal Gunni, IPS – 2010 బ్యాచ్) విజయవాడ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో కదంబరి జెత్వానీ కేసులో 2024 సెప్టెంబరులో సస్పెండ్ అయ్యారు. పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar, IPS – 1993 బ్యాచ్)ను 2025 మార్చిలో సస్పెండ్ చేసింది. ఆయన అనుమతి లేకుండా పలు విదేశీ పర్యటనలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సస్పెన్షన్‌ను 2025 ఆగస్టు వరకు పొడిగించారు. సునీల్ కుమార్‌పై మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై కస్టడీలో హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్. సంజయ్ (N. Sanjay, IPS – 1996 బ్యాచ్)ను
2024 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంజయ్‌ను సస్పెండ్ చేసింది. ఆయనపై AGNI – NOC వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో అవకతవకలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
IPS Officers
జగన్ పాలనలో కీలకంగా ఉన్న అధికారులు ప్రస్తుతం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రూల్ బుక్ కి కాకుండా వ్యక్తిగత విశ్వాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. అధికారం కోసం నిర్మించిన సన్నిహితుల వలయంలో వీరు చిక్కుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎవరిమీదైనా రావొచ్చు, కానీ ఒకే పాలనా కాలానికి చెందిన ఎక్కువ మంది అధికారులపై ఒకేసారి విచారణలు జరగడం చరిత్రలో అరుదైన ఉదాహరణ.
ఒక ప్రభుత్వ కాలాన్ని, దాని లక్ష్యాలను నిర్వచించే ప్రధాన బలం పరిపాలనా వ్యవస్థదైతే – ఆ వ్యవస్థలోని ముఖ్యులపైన్నే విచారణ జరుగుతుండడం గమనార్హం.
Next Story