
బిక్షాటన నుంచి చదువులమ్మ ఒడిలోకి...
అధికారుల చొరవతో చిన్నారులకు చదువుకునే అవకాశం
నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీధుల్లో రోజూ జీవనం కోసం భిక్షాటన చేస్తూ కనిపించే ఇద్దరు చిన్నారులు సీహెచ్ పెంచలయ్య, వి వెంకటేశ్వర్లు. తమ జీవితాల్లో కొత్త ఆశల కిరణాన్ని చూశారు. వారి చిన్ని హృదయాల్లో చదువుకోవాలనే తపన, ఒక ఉన్నత భవిష్యత్తు కలలు, ఆ కలలను నిజం చేసే అవకాశం ఇప్పుడు వారి ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో వీఆర్ స్కూల్‌లో కొత్త ప్రయాణం ఆరంభించిన ఈ చిన్నారుల ఆశలు చిగురించనున్నాయి.
నెల్లూరు వీధుల్లో పెంచలయ్య, వెంకటేశ్వర్లు ఏడు, ఆరు సంవత్సరాల వయసులో భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. పెంచలయ్య తల్లిదండ్రుల ఆచూకీ తెలియదు. వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ కాగితాలు, గాజు సీసాలు వేరుకుంటారు. ఈ చిన్నారుల జీవితాలు కష్టాలతో నిండినవి. కానీ వారి హృదయాల్లో చదువుకోవాలనే ఆకాంక్ష ఎప్పుడూ ఉండేది. ఒక రోజు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్ ను కలిసిన ఈ ఇద్దరు బాలలు, తమ కలను విన్నవించారు. “సార్ మేము వీధుల్లో భిక్షాటన చేస్తాం. కానీ ఈ స్కూల్‌లో మాకు చదువు చెప్పిస్తారని విన్నాం. మమ్మల్ని చేర్చుకోండి,” అని ఆవేదనతో వేడుకున్నారు. ఈ చిన్నారుల ఆశలు, వారి కళ్ళలోని ఆత్మవిశ్వాసం కమిషనర్‌ను కదిలించాయి.
ఈ విషయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే స్పందించి ఈ చిన్నారులను వెతికి వారికి వీఆర్ స్కూల్లో అడ్మిషన్ కల్పించాలని అధికారులను ఆదేశించారు. జులై 7, 2025న నెల్లూరులోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన వీఆర్ హైస్కూల్‌ను అత్యాధునిక సౌకర్యాలతో పునరుద్ధరించి, మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా, పెంచలయ్య, వెంకటేశ్వర్లులకు అడ్మిషన్ ఫామ్‌లను స్వయంగా అందజేసి, వారి విద్యాభ్యాసానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. “మీరు కష్టపడి చదువుకోండి, భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగండి. ఆల్ ది బెస్ట్!” అని చిన్నారులను ఉత్సాహపరిచారు.
వీఆర్ స్కూల్లో 5,000 అడ్మిషన్ దరఖాస్తులలో 1,050 మంది నిరుపేద విద్యార్థులకు అవకాశం లభించింది. ఈ స్కూల్‌లో చేరిన పెంచలయ్య, వెంకటేశ్వర్లు ఇప్పుడు కేవలం చదువు మాత్రమే కాకుండా, ఒక కొత్త జీవితాన్ని ఆరంభించారు.