
ఏపీలో గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్
ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఖర్చయ్యే రూ. 25 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రభుత్వం భరించేందుకు సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో సరికొత్త నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి నేపథ్యంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే మండపాలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని మంత్రి లోకేష్‌ను పలువురు నిర్వాహకులు కోరడంతో దీనిపై సానుకూలంగా స్పందించిన లోకేష్ సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లతో చర్చించారు. అనంతరం నిర్వాహకులు కోరిన విధంగా మండపాలకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15వేలకుపై గణేష్ మండపాలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. వీటికి ఉచితంగా కల్పించే విద్యుత్ సౌకర్యానికి దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వమే దీనిని భరించే విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవడంతో ఇది కార్యరూపం దాల్చిందని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.