వైసీపీలో నలుగురు.. టీడీపీలో ముగ్గురు
x

వైసీపీలో నలుగురు.. టీడీపీలో ముగ్గురు

మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంలో వైఎస్‌ఆర్‌సీపీ కంటే టీడీపీ వెనుకబడింది.


తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంలో ఒక అడుగు వెనక్కి వేశారు. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కంటే తక్కువ సంఖ్యలో మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నలుగురికి మంత్రి వర్గంలో మంత్రులుగా అవకాశం కల్పిస్తే.. తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం కేవలం ముగ్గురు మహిళలకు మాత్రమే మంత్రి వర్గంలో చోటు కల్పించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఒక మెట్టు పైన నిలచింది. అంతేకాకుండా మహిళలను ఏకంగా ఉప ముఖ్యమంత్రులుగాను, హోమ్‌ మంత్రులుగాను సమున్నత స్థానం కల్పించడంలోను చంద్రబాబు కంటే జగన్‌ ప్రభుత్వం పై చేయి అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక మహిళకు హోమ్‌ మంత్రిని చేసి అప్పటి వరకు పురుషులను మాత్రమే హోమ్‌ మంత్రులుగా కొనసాగుతున్న రికార్డును డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి బ్రేక్‌ చేశారు. ఇదే విధానం జగన్‌మోహన్‌రెడ్డి కూడా అనుసరించారు. రెండు పర్యాయాలు చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో మహిళలకే హోమ్‌ శాఖను కట్టబెట్టారు. తొలుత మేకతోటి సుచరితను హోమ్‌ మంత్రి చేసిన జగన్‌ తర్వాత తానేటి వనితను ఆ స్థానంలో కూర్చో పెట్టారు.

తాజాగా చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలో ముగ్గురు మహిళలకు మాత్రమే మంత్రి పదవులు కల్పించారు. వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్‌ సవితలను చంద్రబాబు తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. వీరిలో అనిత ఎస్సీ, సంధ్యారాణి ఎస్టీ, సవిత బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలు. అంతేకాకుండా వీరిలో ఇద్దరు ఉత్తరాంధ్రకు చెందిన వారు కాగా ఒకరు రాయలసీమకు చెందిన వారు. అనిత అనకాపల్లి జిల్లా పాయకాపురం నుంచి గెలుపొందగా, గుమ్మడి ∙సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి, సవిత అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి గెలుపొందారు. మరొక విశేషం ఏమిటంటే అనిత రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందగా, సంధ్యారాణి, సవితలు తొలి సారి గెలిచి మంత్రులయ్యారు.
అనిత 2014లో పాయకరావు పేట నుంచి తొలి సారి గెలిచారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చెంగల వెంకటరావుపై 2,828 ఓట్ల మెజారితో గెలిచి తొలి సారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి కొవ్వూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో 25వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో ఓడి పోయారు. 2024 ఎన్నికల్లో కంబాల జోగులుపై 43వేల ఓట్ల మెజారిటీతో పాయకరావుపేట నుంచి రెండో సారి గెలుపొందారు. అనితది విశాఖపట్నం జిల్లా ఎస్‌ రాయవరం మండలం, లింగరాజుపాలెం. ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఎంఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయురాలయ్యారు. 2012లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
గుమ్మడి సంధ్యారాణి టీడీపీలో సీనియర్‌ నేతే అయినప్పటికీ తొలి సాగి ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడం చకచక జరిగి పోయాయి. విజయనగరంలోని ఎంఆర్‌ మహిళా కళాశాల నుంచి డిగ్రీ చదివారు. 1999లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సాలూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్‌ భంజ్‌దేవ్‌ చేతిలో ఓడి పోయారు. తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. 2009లో సాలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో ఓడి పోయారు. 2014 ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌కు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. 2015లో ఎమ్మెల్సీ అయ్యారు. 2024 ఎన్నికల్లో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొరపై గెలిచి మంత్రి అయ్యారు.
సవిత తొలి సారి గెలిచి మంత్రి అయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో సవిత జన్మించారు. గతంలో హిందూపురం ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పని చేసిన సోమందేవపల్లి రామచంద్రారెడ్డి కుమార్తె సవిత. ఎస్కే యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేశారు. 2024 ఎన్నికల్లో పెనుగొండ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సవిత వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై 33వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత టీడీపీ హయంలో ఏపీ కురుబ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు.
Read More
Next Story