టీటీడీ కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్ గా మారిన ధర్మారెడ్డి?
x

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్ గా మారిన ధర్మారెడ్డి?

టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారినట్టు సమాచారం.


శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారినట్టు సమాచారం. రెండు రోజులుగా ఆయన్ను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఆయన ఈ మాట చెప్పినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే వైసీపీ హాయాంలో కల్తీ నెయ్యి వాడినట్టు తేలడమే కాకుండా ఆనాటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్లకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందని స్థానిక రాజకీయ నాయకుల అంచనా.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. "కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మా రెడ్డి (Dharma Reddy) అప్రూవర్‌గా మారారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పట్లో ఏం జరిగిందో సవివరంగా సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వైసీపీ పాలనలో టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) ఒత్తిడి వల్లే అవన్నీ జరిగినట్టు అంగీకారించారు. కల్తీపై సీబీఐ సిట్‌కు ధర్మారెడ్డి కీలక సమాచారాన్ని అందించారు."

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో రెండవ రోజు సీబీఐ సిట్ విచారణ జరిగింది. తిరుపతి అలిపిరి కేంద్రంలో సిట్ కార్యాలయానికి టీటీడీ మాజీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, బోలెబాబా డైరెక్టర్ విపిన్ జైన్, పామిల్ జైన్ వేరువేరుగా విచారణకు హాజరయ్యారు. విచారణలో ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారి.. ఈ వ్యవహారానికి సంబంధించి అనేక విషయాలను సిట్‌కు తెలియజేసినట్లు తెలుస్తోంది. టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి అప్పట్లో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ను ఉపయోగించుకుని కల్తీ నెయ్యికి కారణమైనట్టు ధర్మారెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది.
లడ్డూకు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని సిట్‌ ప్రశ్నించగా హైకమాండ్‌ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి జవాబు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ హైకమాండ్‌ ఎవరో ఆయన చెప్పలేదని తెలుస్తోంది. 2019లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించానని, ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని చెప్పినట్టు తెలిసింది.
2022 ఆగస్టులో తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీవైష్ణవి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్, భోలేబాబా డెయిరీ ట్యాంకర్లు, క్యాన్ల ద్వారా సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నకు ధర్మారెడ్డి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారని, అన్నింటికీ హైకమాండ్ అనే పదాన్నే ఉపయోగించారని తెలుస్తోంది.
Read More
Next Story