అధికారానికి దూరం కావడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఒక్కొక్కరుగా వీడుతున్నారు. గత వారం రోజుల్లో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కిలారి రోశయ్య వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. ఈయనకు గుంటూరులో షాపింగ్ మాల్స్, ఇతర వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఎక్కువుగా అద్దెల రూపంలో నెలకు సుమారు రూ. 50లక్షల వరకు వస్తాయి. అలాగే పొన్నూరు, రేపల్లి, తెనాలి, హైదరాబాద్‌లోను ఆస్తులు ఉన్నాయి. వీటన్నింటిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కన్ను పడకుండా ఉండాలంటే వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేయడమే మంచిదని భావించినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2019 నుంచి 2024 వరకు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న రోశయ్య విపరితీంగా మట్టి తవ్వకాలకు పాల్పడ్డారని, పలు రకాలుగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, కిలారి రోశయ్య హయాంలో వనరుల దోపిడీ జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా 2019 నుంచి 2024 వరకు పని చేసిన మద్దాల గిరి వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరి, ఆ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, తనకు కావలసిన పనులను చక్క బెట్టుకున్నారని, సుమారు రూ. 7వేల కోట్ల విలువైన పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేయించుకున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గుంటూరులో ఈయనకు జూట్ మిల్లు పరిశ్రమ ఉంది. వేల కోట్ల టర్నోవర్ దీని నుంచి జరుగుతుంటుంది. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. స్వతహాగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత కావడం వల్ల వ్యాపారంలో బాగా ఆరితేరారు. తన ఆస్తులను కాపాడుకోవాలంటే వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేదని పలువురు సన్నిహితుల వద్ద చెప్పినట్లు టాక్ ఉంది.
అలాగే రోశయ్య కూడా కేవలం ఆస్తులను కాపాడు కోవడానికే వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశారని అతని సన్నిహితులు చర్చించుకుంటున్నారు. రోశయ్య కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రస్తుతం వైఎస్‌ర్‌సీపీలో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ కుటుంబాలతో ఈయనకు బందుత్వం ఉంది. అలాగే జనసేనలోని కొందరి ఎమ్మెల్యేలతో బందుత్వం ఉంది. రోశయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలిసి టీడీపీ కానీ జనసేనలో కానీ చేరేందుకు ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ వారు ఇప్పటి వరకు వేరే పార్టీల నుంచి వచ్చిన వారినెవ్వరినీ చేర్చుకోలేదు. అయితే రోశయ్య ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. దీంతో నేటికీ టీడీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారని, ఈ నేపథ్యంలోనే ఇరువురు టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చర్చ సాగుతోంది.