చక్రం తిప్పిన మిథున్.. రాయచోటిలో సైకిల్ దిగిన రమేష్
x

చక్రం తిప్పిన మిథున్.. రాయచోటిలో సైకిల్ దిగిన రమేష్

విలువ లేని చోట నేను ఉండలేను. ఇక నా దారి నాదే అంటున్నారు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి.



(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: మారుతున్న సమీకరణలు రెండు ప్రధాన పార్టీలకు గట్టి దెబ్బ తగులుతోంది. నివారణ చర్యలకు కూడా సమయం ఇవ్వలేనంత విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోడ దూకేసి షాక్ ఇస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. పట్టు నిలుపుకోవాలని వైఎస్ఆర్సిపి సాగుతోంది. "సీఎం అయ్యేవరకు అసెంబ్లీలో అడుగు పెట్టను" అని భీష్మ ప్రతిజ్ఞ చేసిన టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి ప్రస్తుత ఎన్నికల మిషన్- 2024 సవాల్‌గా మారింది. ఎవరికి వారు ఆత్మస్థైర్యంతో ఎన్నికలు ఎదుర్కోవడానికి వ్యూహ ప్రతివ్యూహాలతో బస్సు యాత్రల ద్వారా జనంలో ఉన్నారు.


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు.. అంతకుముందు కూటమి ఏర్పాటు.. దానికి ముందు ఉన్న అంచనాలకు, ప్రస్తుత వాస్తవ రాజకీయ పరిస్థితి పూర్తి విభిన్నంగా మారినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి దళితులు, బీసీలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో కూడా అధికార వైఎస్సార్సీపీకి గట్టిగానే తగిలింది. జిల్లాలో కీలక పాత్ర వహిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎప్పటికప్పుడు తీసుకున్న నష్ట నివారణ చర్యలతో కాస్త సద్దుమణిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.

సైకిల్ దిగిన రమేష్

కడప జిల్లా రాయచోటి టిడిపి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి అనుకున్నట్లుగానే వైఎస్ఆర్సిపిలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. 2024 ఎన్నికలకు చివరి క్షణం వరకు దోబూచులాడిన టిడిపి అభ్యర్థిత్వం ఆయనకు దక్కలేదు. కులాలు, వర్గాల పరంగా బలంగా ఉన్న రమేష్ రెడ్డి పార్టీ మారాలని తీసుకున్న నిర్ణయంతో టీడీపీకి దెబ్బ తగిలింది. ఊహించినట్టుగానే.. టిడిపి అభ్యర్థిత్వం దక్కించుకున్న మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి ఒంటరి అయ్యారు.

ఫలించిన మిథున్ దౌత్యం

రాయచోటి నియోజకవర్గం నుంచి టికెట్ దగ్గర టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డితో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిషన్ రెడ్డి నిలిపిన దౌత్యం ఫలించింది. మిథున్ రెడ్డితో కలిసి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆర్ రమేష్ రెడ్డితో ఎంపీ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. మంచి రోజు చూసుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపిలో చేరతారని మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఈ విషయమై రమేష్ రెడ్డి.. ది ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు.


" నాకు అవకాశం కల్పించడంలో అన్యాయం చేశారు. 25 ఏళ్ల నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టారు" అని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కనీసం మాతో మాట్లాడను కూడా లేదని అన్నారు. " సీనియర్ల వల్ల ఆయన కుమారుడికి ( నారా లోకేష్)కు ఇబ్బంది అన్నట్లు భావిస్తున్నారు" అని కూడా అన్నారు. తండ్రి కొడుకులు ( చంద్రబాబు, లోకేష్) అభద్రతాభావానికి లోనవుతున్నట్లు ఉందని రమేష్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హామీలు తీసుకునేది ఏమీ లేదు రానున్నది మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉన్నాయి. విలువ గుర్తింపుని చోట ఎందుకు ఉండడం అనిపించింది" అని తన మనసులో మాట చెప్పారు.

లక్కిరెడ్డిపల్లి నుంచి రాయచోటికి

లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి తండ్రి రాజగోపాల్ రెడ్డి అందించిన రాజకీయ వారసత్వంతో ఆర్ రమేష్ రెడ్డి.. 1999లో టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2094లో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గంలోకి విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుంచి పోటీ చేసిన రమేష్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత.. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన రమేష్ రెడ్డి వరుస ఓటములు చవిచూశారు. ఇప్పుడేమైంది అంటే...


2004 సార్వత్రిక ఎన్నికలకు రాయచోటి నియోజకవర్గంలో పరిస్థితులు అనుకూలంగా మారాయని భావించారు. అభ్యర్థిత్వం తనకే అని రమేష్ రెడ్డి ధీమాతో ఉన్నారు. రమేష్ రెడ్డికి రాయచోటి టికెట్ దక్కితే, బలిజ సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ రాయుడు కుమారుడు బాలసుబ్రమణ్యం రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వని విధంగా వారి అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో..రాయచోటిలో రమేష్ రెడ్డికి భంగపాటు తప్పలేదు.

ఒంటరైన టిడిపి అభ్యర్థి

రాయచోటి నియోజకవర్గం నుంచి పోటీకి హామీతోనే కాంగ్రెస్ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టిడిపిలో చేరారు. ఆయనకే టిడిపి అవకాశం కల్పించింది. రమేష్ రెడ్డి టిడిపికి దూరం ఉండడంతో ప్రసాద్ రెడ్డికి మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ రాయుడు మాత్రమే అండగా మిగిలారు. ఈసారి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డితో పోటీ పడుతున్నారు. గతంలో పోటీ పడిన ప్రతిసారి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి చేదు అనుభవాన్ని రుచి చూశారు. 2012లో తొలిసారి శ్రీకాంత్ రెడ్డితో తలపడిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 25,344 ఓట్లు సాధించారు. వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డికి 90,978 ఒట్లు దక్కాయి.

రెండోసారి 2014 లో శ్రీకాంత్ రెడ్డితో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున పోటీ చేసి 3272 ఓట్లు సాదిస్తే గడికోట శ్రీకాంత్ రెడ్డి 96,891 ఓట్లు దక్కాయి. రెండు సార్లు శ్రీకాంత్ రెడ్డితో తలపడిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అత్యంత ఘోరంగా ఓటమి చెందారు. మూడోసారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయనున్న రాంప్రసాద్ రెడ్డికి మెజారిటీ ఓటర్లు ముస్లిం, బలిజ సామాజిక వర్గాల ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారు అనేది వేచి చూడాలి.


Read More
Next Story