మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు అరెస్ట్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై కేసులు పెరుగుతున్నాయి. తాజా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పినెపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. తమిళనాడులోని ముధురైలో శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దళిత యువకుడు, వాలంటీర్ అనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అక్కడే న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి, ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీకి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దుర్గా ప్రసాద్ హత్య కేసులో పినిపే శ్రీకాంత్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. కోనసీమ అల్లర్ల సమయంలో దుర్గా ప్రసాద్ 2022, జూన్6న హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వడ్డీ ధర్మేష్ వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా ఉన్నాడు. ఆతడు ఈ నెల 18న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో శ్రీకాంత్ ప్రమేయం ఉందని భావిస్తున్న పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.