వైసీపీకి మరో మాజీ మంత్రి గుడ్‌బై..
x

వైసీపీకి మరో మాజీ మంత్రి గుడ్‌బై..

వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయా? వారం రోజుల్లో మరో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేయడం దీనికే సంకేతమా.. రానున్న రోజుల్లో మరికొందరు పార్టీని వీడనున్నారా..


ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీ హయాంలో మంత్రులుగా విధులు నిర్వర్తించిన నేతలు ఒకరి తర్వాత ఒకరుగా పార్టీని వీడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలకు వైసీపీ ద్వారా న్యాయం జరుగుతుందని భ్రమపడే తాను వైసీపీలో చేరానని, కానీ వైసీపీలో ఉండి ప్రజాసేవ కూడా చేయలేకపోయానని ఆయన వెల్లడించారు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మరో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి తన రాజీనామా లేఖను అందించారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తన లేఖలో వివరించారు.

రాజీనామాకు మనస్పర్థలే కారణమా

ఈ క్రమంలో వైసీపీకి శిధ్ధా రాఘవరావు గుడ్‌బై చెప్పడానికి వెనక మనస్పర్థలు ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఆయన దర్శి టికెట్ కోరారని, అందుకు వైసీపీ నిరాకరించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం సీట్లలో దేని నుంచైనా పోటీ చేయాలని ఆయనకు ప్రతిపాదించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాఘవరావు.. ఎక్కడి నుంచి పోటీ చేయకూడదని నిశ్చయించుకున్నారు. అదే విధంగా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ.. చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఘోరపరాజయాన్ని చవిచూడటంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. రాజీనామా వ్యక్తిగత కారణాలతోనే అని ఆయన చెప్తున్నప్పటికీ వైసీపీ పని అయిపోయిందని, అది అర్థమయ్యే ఆయన పార్టీకి దూరం పాటించాలని రాజీనామా చేశారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.

దానికి తోడు తనకు కోరిన సీటు నుంచి టికెట్ ఇవ్వలేదన్న అసంతృప్తి కూడా శిద్దా రాఘవరావు లోపలన ఉందని, దాని కారణంగానే ఆయన ఎన్నికల ప్రచారాలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, ఎన్నికల వ్యవహారంలో కూడా ఎక్కడా తలదూర్చకుండా మిన్నుకుండిపోయారని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరి అసలు విషయం ఏంటో ఇక ఆయనే చెప్పాలి.

శిద్దా రాఘవరావు నేపథ్యం

అనేక వ్యాపారాలు చేసి ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుని ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేశారు శిద్దా రాఘవరావు. ఆయన తొలిసారి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో విజయం కూడా సాధించారు. తొలిసారే గెలిచినా ఆయనకు అదృష్టం కలిసొచ్చో ఏమో కానీ టీడీపీ అధిష్టానం ఆయనకు మంత్రిపదవిని కట్టబెట్టింది. టీడీపీ హయాంలో ఆయన పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలం ఆయన సైలెంట్ అయ్యారు. కాలక్రమేణా ఆయన వైసీపీ గూటికి చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దర్శి టికెట్ ఆశించగా ఆయనకు నిరాశే ఎదురైంది. వైసీపీ ఆయనకు వేరే సీట్లు ప్రతిపాదించడంతో ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

వైసీపీలో వలసలుకు సంకేతమా..

వారం రోజుల్లో ఇద్దరు మాజీ మంత్రులు పార్టీని వీడటం పార్టీలో వలసలు మొదలయ్యాయని చెప్పడానికే సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. ఓటమిని చవిచూసిన వైసీపీకి తొలి నెలలో ఇద్దరు మాజీ మంత్రులు టాటా చెప్పారని, రానున్న అతి కొన్ని రోజుల్లోనే మరింత మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే తమ ఓటమికి జగన్ ప్రవర్తన కూడా ఒక కారణమని బహిరంగంగానే చెప్తున్నారని, దానికి తోడు ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా ప్రతికార చర్యలకు పాల్పడుతున్న క్రమంలో ఈ వలసలు మరింత ముమ్మరం కావొచ్చని వారు అభిప్రాయపడ్డారు.

Read More
Next Story