
జగన్ కి రాఖీ కడుతున్న రజనీ (ఫైల్ ఫోటో)
జగన్ 'డిజిటల్ బుక్'లో అడ్డంగా బుక్ అయిన మాజీ మంత్రి విడదల రజనీ
వైసీపీ కొత్తగా తెచ్చిన ‘డిజిటల్ బుక్’ యాప్ ఇప్పుడు ఆ పార్టీవాళ్లకే షాక్ ఇవ్వడం కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రెడ్ బుక్, బ్లూ బుక్, డిజిటల్ బుక్ వంటివాటి హడావిడి నడుస్తోంది. ప్రత్యర్థుల ఆగడాల చిట్టాలను రాసేందుకు టీటీడీ నాయకుడు నారా లోకేశ్ రెడ్ బుక్ తీసుకువస్తే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ తీసుకువచ్చారు. ప్రస్తుతం సాగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి పోటీగా వైసీపీ కొత్తగా తెచ్చిన ‘డిజిటల్ బుక్’ యాప్ ఇప్పుడు ఆ పార్టీవాళ్లకే షాక్ ఇవ్వడం కలకలం రేపింది.
డిజిటల్ బుక్ లో వైసీపీ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు అందుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజినిపై డిజిటల్ బుక్ లో ఫిర్యాదు నమోదు అయింది. దీంతో ఆమె లబోదిబోమంటుండగా ఆమె ప్రత్యర్థులు- అటు సొంత పార్టీలో ఇటు టీడీపీలోని వారు- సంబరాలు చేసుకుంటున్నారు.
విడదల రజినిపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వైసీపీకి ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, తన ఇంటిపై రజిని దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి రజినిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సొంత డిజిటల్ బుక్ యాప్‌లో ఫిర్యాదు అందడంపై వైసీపీలో కలకలం రేపింది.
విడదల రజినీపై గతంలో కూడా కొందరు క్వారీ యజమానులు ఫిర్యాదులు చేశారు. వాటిపై కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవతరం పార్టీ నాయకుడు ఫిర్యాదు చేయడం గమనార్హం. రావు సుబ్రమణ్యం ఫిర్యాదు ఇలా ఉంది. ‘2022లో చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, నా ఇల్లు, కారుపై మాజీ మంత్రి విడదల రజిని దాడి చేయించారు. మాజీ మంత్రిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశా. ఈ ఫిర్యాదుపై నాకు న్యాయం చేస్తే జగన్ చెప్పినట్లు వైసీపీ కార్యకర్తలకూ న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుంది’ అని రావు సుబ్రహ్మణ్యం కోరారు. వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌లో మాజీ మంత్రిపై ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చిన టికెట్‌ను సుబ్రహ్మణ్యం మీడియాకు చూపించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల వైసీపీ కార్యకర్తల కోసం ‘డిజిటల్ బుక్’ వెబ్ సైట్‌ను ప్రారంభించారు. ఈ డిజిటల్ బుక్ వైసీపీ కార్యకర్తలకు శ్రీరామ రక్ష అని జగన్ చెబితే ఇప్పుడు దాన్ని ప్రత్యర్థి పార్టీల వాళ్లు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇటువంటి వాటిపై వైఎస్ జగన్ స్పందిస్తారో వేచిచూడాలి.
Next Story