సీఎస్ మెడకు బిగుసుకుంటున్న విశాఖ భూముల ఉచ్చు
x

సీఎస్ మెడకు బిగుసుకుంటున్న విశాఖ భూముల ఉచ్చు

ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి మెడకు ఉత్తరాంధ్ర భూముల కాజేసిన కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలను సీఎస్ తిప్పికొట్టినా లాభం లేకపోయింది.


ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి మెడకు ఉత్తరాంధ్ర భూముల కాజేసిన కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలను సీఎస్ తిప్పికొట్టినా లాభం లేకపోయింది. ఉత్తరాంధ్రలో ఈ అంశంపై జరుగుతున్న చర్చలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. వందల ఎకరాల భూములను జవమర్ రెడ్డి కాజేశారని గతంలో మూర్తి యాదవ్ ఆరోపించగా ఇప్పుడు దానిపైన విచారణ జరగాలని మాజీ ఐఏఎస్ అధికారులు కోరుతున్నారు. తాజాగా దీనిపై పల్లా శ్రీనివాస్ కూడా ఘాటుగానే స్పందించారు. ఈ అంశంలో నిజానిజాలు వీలైనంత త్వరగా తేలాలని, ఇది సీఎస్ పరువుకు సంబంధించిన అంశమే కాదని, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరువుకు సంబంధించిన అంశమని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీబీఐ విచారణ జరగాలి

ఉత్తరాంధ్రలో రూ.2వేల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడిన సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడిపై సీబీఐ విచారణ జరగాలని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కోరారు. ‘‘జీఓ 596 వచ్చిన తర్వాత అసైన్డ్ భూముల లబ్ధిదారులకు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లను నేరుగా ఇవ్వాలి. కానీ రైతులకు వీటిని ఇవ్వడం లేదు. జీఓ 596 అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది రైతులకు ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లను అందించారో లెక్కలు బహిర్గతం చేయాలి. భోగాపురం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల భూములను కాజేయడానికి సీఎస్ భారీ కుట్ర చేశారు’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.

అధికార గర్వమే కారణం

ఇంతటి నీచ పనికి, అవినీతికి పాల్పడటానికి అధికారంతో వచ్చిన గర్వమే కారణమని పల్ల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ‘‘సీఎస్ పదవితో వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూమిని కాజేయాలని జవహర్ రెడ్డి అనుకోవడం అత్యంత దారుణమైన అంశం. లబ్ధిదారులందరికీ అందాల్సి ఫ్రీహోల్డ్ పత్రాలను కేవలం దళారులతో అగ్రిమెంట్ చేసుకున్న వారికే అందించారు. జీఓ వచ్చిన 10 రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు రగడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే భూఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ జరిపిస్తాం. రైతులకు న్యాయం చేస్తాం’’ అని ఆయన హామీ ఇచ్చారు.

అన్యాయం చేసే సవరణ ఇది

జవహర్ రెడ్డిపై వస్తున్న భూకబ్జా ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కోరారు. దీనిని ఒక అధికారికి సంబంధించిన అంశంలా కాకుండా వందలాది మందికి జరుగుతున్న అన్యాయంలా చూడాలని కోరారు. ఏపీ అసైన్డ్ భూముల చట్టం 1977లో చేసిన సవరణ అబ్ధిదారులకన్నా కబ్జాకోరులు, ధనవంతలు, అధికార బలం ఉన్న వారికి బాగా లాభిస్తోందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘1953లో రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచడం జరిగింది. అది జీవనోపాధి కోసం అసైన్ చేయబడిన భూమి. అమ్ముకోవడానికని ఇచ్చినది కాదు. కానీ 2023లో ఈ చట్టాన్ని ప్రభుత్వం సవరణ చేస్తూ ఫ్రీహోల్డ్‌కు అనుమతించింది. అది కబ్జాదారులకు వరంగా మారుతుంది. ఈ సవరణ.. లబ్ధిదారునికి తన భూమిని అమ్ముకునే హక్కు కలిగింది. దానిని మంచి అవకాశంగా తీసుకున్న దళారులు, అధికార బలం, ధన బలం ఉన్న వారు లబ్ధిదారులను బెదిరించో భయపెట్టో వాటిని తమ సొంతం చేసుకునే ప్రమాదం ఉంది. వేల ఎకరాల భూములు చేతులు మారిపోవచ్చు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

చట్టాలను రద్దు చేయండి..

ఈ సందర్బంగా వీటిని అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో పాటు అసైన్డ్ భూముల చట్టానికి కూడా తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా వీటి వెనకున్న స్కామ్‌లను బయటపెట్టాలని, దీనిపై విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రంలో అసైన్డ్ భూముల వ్యవహారంలో వివాదం జరుగుతోంది. సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు దాదాపు 8వందల ఎకరాల అసైన్డ్ భూములను బినామీల పేర్లతో కొనుగోలు చేశారని, వాటి కోసం రహస్య పర్యటనలు చేశారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపించారు. కొన్ని పేర్లను కూడా వెల్లడించారు. వాటికి అధికారులు విచారణ జరిపించాలి’’ అని రమేష్ కోరారు.

Read More
Next Story