‘చంద్రబాబు సమాధానం చెప్పాలి’.. మాజీ డిప్యూటీ సీఎం విమర్శలు
x

‘చంద్రబాబు సమాధానం చెప్పాలి’.. మాజీ డిప్యూటీ సీఎం విమర్శలు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఆశ చూపి పేదల కడుపు కొడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమంటూ వ్యాఖ్యానించారు.


ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై మాట్లాడుతూ.. ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజమని హితవు పలికారు. అలాగని గెలిచిన గర్వంతో ఓడిన వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని సూచించారు. తాను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని అన్న ఆయన.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈరోజు అతలాకుతలమైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం చేతకాని తనమే ఇందుకు కారణం అని అన్నారు. అధికారం వచ్చీ రాగానే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, సూపర్ సిక్స్ హామీలను చూస్తే భయమేసతోందని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు అనడం సిగ్గు చేటంటూ ఎద్దేవా చేశారు. కూటమి సర్కార్ వచ్చిన క్షణం నుంచి రాష్ట్రం అస్తవ్యస్తంగా మారడం ప్రారంభమైందని, ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

వాటి జోలికి వెళ్లొద్దు

‘‘గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పప్పు, బెల్లంలా సంక్షేమ పథకాలు పంచారు. కానీ ఇప్పుడు పేదలకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. తాను చెప్పిన సూపర్ సిక్స్ హామీలను చూస్తేనే భయమేస్తుందని చంద్రబాుబ అంటున్నారు. దళితులు అన్ని రంగాల్లో రాణించాలన్నది అంబేద్కర్ ఆశయం. ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగానే చంద్రబాబు చర్యలు ఉండాలి. విద్య, వైద్యం జోలికి వెళ్లోద్దని చంద్రబాబుకు, రెడ్‌బుక్ లోకేష్‌కు, పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.

అవినీతి జరిగలేదు

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో భారీగా అవినీతి జరిగిందని, దీని ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుచుబీ అంటూ కూటమి ప్రభుత్వ అవాస్తవాలను ప్రచారం చేసిందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మద్యం పాలసీలో అవినీతి ఏమీ జరగలేదు. మద్యంలో కొత్త బ్రాండ్‌లన్నీ చంద్రబాబు తెచ్చినవే. వైసీపీ కొత్తగా తెచ్చినవేమీ లేవు. తప్పు చేస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధం. ప్రజలకు ఏమార్చే చంద్రబాబు గెలిచారు. జగన్ హయాంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. ప్రతి విద్యార్థికి ఇంగ్లీషు మీడియం విద్యను అందించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారు. మాపై కోపాలు ఉంటే ప్రజలపై దాడులు చేయకుండా మాపైనే మీ ప్రతాపం చూడండి. మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధం’’ అంటూ వ్యాఖ్యానించారు.

పేదల కడుపు కొడుతున్నారు

‘‘వైఎస్ జగన్ తెచ్చిన నవరత్నాలను కొనసాగిస్తామంటూ ఎన్నికల ప్రచారం చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని ఎందుకు కొనసాగించడం లేదో సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం.. ప్రజలకు ఆశ చూపి.. పేదల కడుపు కొడుతోంది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను గాలికొదిలేశారు. వైసీపీ తెచ్చిన ఎన్నో పథకాలను నాశనం చేశారు. కానీ విద్య, వైద్యం జోలికి మాత్రం వెళ్లకండి. జగన్ ఎప్పుడూ కూడా కులాల గురించి ప్రస్తావించలేదు. కానీ కూటమి నేతలు మాత్రం ఎక్కడికి వెళ్లినా కులాల గోలే పెట్టారు. కానీ మీ సామాజిక వర్గం ద్వారా విజయం సాధించగలిగినందుకు చంద్రబాబుకు అభినందనలు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read More
Next Story