ఎన్టీఆర్ కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి నటుడు అని, ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తే.. చంద్రబాబు రాజకీయాల్లో నటిస్తున్నారని, తమపైన, తమ నాయకులపైన చేస్తున్న దాడులకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. బుధవారం తాడేపల్లి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు మీద ధ్వజమెత్తారు. రైతులను పరామర్శిస్తే కేసులు పెట్టడం ఎక్కడైనా చూశామా? అంటూ నిలదీశారు. మిర్చి రైతులను, పొగాకు రైతులను పరామర్శిస్తే తనపైన, తమ నాయకులపైన కేసులు పెడుతున్నారని, 15 మంది రైతులను అరెస్టు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, గిట్టుబాటు ధరలకు కల్పించడంలో సీఎం చంద్రబాబు వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. ఇలా అయితే రైతులు ఎల బతకాలని ప్రశ్నించారు. తాను మిర్చి రైతులను పరామర్శ కోసం మిర్చి యార్డుకు పోయినందుకు తనకు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ విత్‌డ్రా చేశారని మండిపడ్డారు.
తమ కార్యకర్తలను టీడీపీ వాళ్లు చంపినా తాను వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించకూడదా? అని ప్రశ్నించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపైన దాడికి పాల్పడటం దుష్ట సంప్రదాయం కాదా? అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోకుండా బాధితుడు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపైనే కేసు నమోదు చేశారని ధ్వజమెత్తారు.
సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు కేసులా? అంటూ జగన్ నిలదీశారు. మీకు సినిమా డైలాగులు నచ్చకపోతే ఆ సినిమా మీద సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసి ఆ డైలాగులు తీసివేయించండి, సెన్సార్ బోర్డు ఉండేది అందుకే కదా? అంటూ ప్రశ్నించారు. సెన్నార్ బోర్డు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే సినిమాలు రిలీజ్ అవుతాయి. అలా వచ్చిన సినిమాలో డైలాగులను పోస్టర్లుగా పెట్టారనే కారణంతో ఇద్దరిని రిమాండ్‌కు పంపి, 131 మందికి నోటీసులు ఇచ్చారని.. ఇది ఎంత వరకు న్యాయమని జగన్ ప్రశ్నించారు. సినిమా డైలాగులతో సీఎం చంద్రబాబుకి వచ్చిన నష్టం ఏంటి? టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమాల్లో దారుణమైన డైలాగులు ఉన్నాయని.. మరి వాటి సంగతేంటని జగన్ ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి వాళ్ల మనసులు గెలుచుకోవాలే కానీ ఇలాంటి అన్యాయాలకు పాల్పడటమేంటి? అని నిలదీశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారిక మీద టీడీపీ మూకలు ఆమె కారు అద్దారులు ధ్వంసం చేసి. ఆమె మీద హత్యాయత్నం చేయడమే కాకుండా ఆమె బాధపడుతుంటే.. బూతులు తిడుతూ, మహానటి అంటూ అవహేళన చేస్తారా? పచ్చ మూకలకు సిగ్గుండాలి కదా? అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వందలాది మంది పోలీసులను వీఆర్‌కు పంపారని, డీజీ స్థాయి అధికారులను వేధిస్తున్నారని, సీనియర్ ఐపీఎస్‌లు ఆంజనేయులు, సంజయ్, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపైనా తప్పుడు కేసులు బనాయించారని.. 8 మంది డీఎస్పీలను సస్పెండ్ చేశారని, అనేక మంది నిజాయితీ కలిగిన పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత ఇంటికి కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని, సీఐలు గన్ చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణి గోవర్థన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి, పోసాని, కొమ్మినేని శ్రీనివాస్, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డితో పాటు ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారని, తప్పుడు వాంగ్మూలాలతో ఇష్టమొచ్చినట్లు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారి తమ ప్రభుత్వం వస్తే ప్రతి చర్యగా ఇలానే చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదని, దెబ్బ తగిలిన వాడికే బాధ తెలుస్తుందని, తాము అధికారంలోకి వచ్చాక తమ వాళ్లు తన మాట కూడా వినరని, పచ్చ మూకలకు వడ్డీతో సహా చెల్లిస్తారని జగన్ హెచ్చరించారు.