వైసీపీ అధిష్టానంపై బాలినేని బాణాలు.. కనీస మద్దతు లేదంటూ ఆగ్రహం
x

వైసీపీ అధిష్టానంపై బాలినేని బాణాలు.. కనీస మద్దతు లేదంటూ ఆగ్రహం

వైసీపీ పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత నుంచి తానే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని, తన విషయంలో పార్టీ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారాయన.


వైసీపీ పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత నుంచి తానే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని, తన విషయంలో పార్టీ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారాయన. తనను పార్టీ పంట్టించుకోనందుకే పార్టీకి దూరం పాటిస్తున్నానని, తనపై గిట్టని వారు అనేక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కొంతకాలంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైసీపీకి రాజీనామా చేయనున్నారని, జగన్‌తో ఉన్న విభేదాలే ఇందుకు కారణమని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆయన జనసేనలో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు కూడా వాదన వినిపిస్తోంది. ఇవి రోజురోజుకు అధికం అవుతున్న నేపథ్యంలో బాలినేని వీటిపై స్పందించారు. ఈ ప్రచారంలోని వాస్తవాస్తవాలను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలు పంచుకున్నారు.

పార్టీ నుంచి మద్దతు లేదు..

‘‘పార్టీనే నన్ను దూరం పెడుతూ వస్తోంది. ఈవీఎంలలో గందరగోళం జరిగిందంటూ నేను పోరాడుతున్నాను. హైకోర్టుకు కూడా వెళ్లాను. కానీ ఈ పోరాటానికి పార్టీ నుంచి ఏమాత్రం మద్దతు లేదు. అసలు తనకు పట్టదు అన్న విధంగా పార్టీ వ్యవహరిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేదు. అసలు నన్ను కలవడానికి కూడా పార్టీ పెద్దలు ఆసక్తి చూపలేదు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశాను. కానీ ఇప్పుడు ఎవరూ నా గురించి పట్టించుకోవట్లేదు. నా వైపు కూడా చూడటం లేదు. అందుకే ఎన్నికల తర్వాత నుంచి మాత్రం పార్టీకి నేనే దూరంగా ఉండటం ప్రారంభించా’’ అని చెప్పారు.

అందుకే విభేదాలా..

వైసీపీ పెద్దలకు, బాలినేనికి ఎన్నికల టికెట్ కేటాయింపు విషయంలో మాటామాటా పెరిగిందని, అదే వివాదంగా మారిందని కూడా ప్రచారం జరుగుతోంది. టికెట్ తనకు ఇవ్వాలని బాలినేని.. వైసీపీ అధిష్టానాన్ని కోరారని, కానీ అందుకు నిరాకరించిన వైసీపీ.. ఆ స్థానంలో వేరే వారిని నిలబెట్టడంతో బాలినేని ఆగ్రహించారని, అందుకే పార్టీ ప్రచారంలో కూడా అంతగా పాల్గొన లేదని ప్రచారం జోరుగా సాగుతోంది. తీరా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. తనను నిలబెట్టి ఉంటే గెలిచి ఉండేవాళ్లమని కూడా అధిష్టానానికి, బాలినేని మధ్య వాదోపవాదాలు జరిగాయని, ఈ విషయంలోనే పార్టీకి, బాలినేనికి మధ్య విభేదాలు మొదలయ్యాయని ప్రచారం సాగుతోంది.

అందుకే ఆరోపణలు..

బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. వైసీపీని వీడి జనసేనలో చేరనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా బాలినేని ఘాటుగానే స్పందించారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘‘బహుశా నేను జనసేనలో చేరకూడదనే అలా ప్రచారం చేస్తున్నారనుకుంటా. నాకు ప్రజలు మద్దతుగా ఉన్నారు. ఎవరికీ భయపడను. పార్టీ పట్టించుకున్నా.. పట్టించుకోకున్నా.. నాకు ప్రజలు ఉన్నారు. వారి కోసం పోరాడతాను. నా వెంట ప్రజలు ఉన్నంత కాలం నా పోరాటం ఆగదు. పోరాడటానికి నాకు ఏ పార్టీ మద్దతు అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు.

తనపై కొందరు రాజకీయంగా, వ్యక్తిగతంగా గెలవలేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు బాలినేని. ప్రభుత్వం వారిదే ఉంది కాబట్టి.. కావాలంటే సీఐడీ, సీబీఐలతో విచారణ జరిపించుకోవచ్చంటూ ఛాలెంజ్ చేశారు. తాను ఏ తప్పూ చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

Read More
Next Story