
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అరెస్ట్
ముంబాయి నుంచి తీసుకొచ్చిన కడప పోలీసులు అహ్మద్ బాషాను కోర్టులో హాజరు పరిచనున్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప మైనారిటీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కువైట్ వెళ్తుండగా ముంబాయి ఎయిర్ట్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అహ్మద్ బాషాపై కడపలో ఇది వరకు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన విదేశాలకు పారిపోతాడేమో అనే అనుమానాలతో ముందుగానే లుక్‌అవుట్ నోటీసులు కూడా ఆయన మీద జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముంబాయి ఎయిర్ పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు అహ్మద్ బాషాను అదుపులోకి తీసుకొని కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషాను ముంబాయి నుంచి తీసుకొచ్చిన కడప పోలీసులు ఆయనను సోమవారం కడప కోర్టులో హాజరు పరచనున్నారు. ఇది అటు కడపలోను, ఇటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోను కలకలం రేపుతోంది.
కడపలోని వినాయకనగర్ స్థలం విషయంలో అహ్మద్ బాషా దాడికి పాల్పడినట్లు ఆయన మీద కడప పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో పాటుగా ప్రస్తుతం కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డిని దూషించాడని అహ్మద్ బాషాపై కేసులు పోలీసులు నమోదు చేశారు. తనపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో అహ్మద్ బాషా కడపలో ఉంటే పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వేరే దేశాలకు వెళ్లాలని ఆలోచనలు చేశారు. అందులో భాగంగా కువైట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతకు ముందే కడప పోలీసులు అహ్మద్ బాషా మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్తుండగా ముంబాయి ఎయిర్ పోర్టులో అహ్మద్ బాషాను అదుపులోకి తీసుకున్నారు.
Next Story