అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఫోర్జరీ కోణం..!
x

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఫోర్జరీ కోణం..!

ఆంధ్రలో అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారం కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అగ్రిగోల్డ్ భూములను నకిలీ పత్రాలతో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం కబ్జాకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఆంధ్రలో అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారం కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అగ్రిగోల్డ్ భూములను నకిలీ పత్రాలతో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం కబ్జాకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ కేసుల విచారణలో భాగంగానే ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు తీసుకుంది. ఇందులో సంతకాల ఫోర్జరీ కోణం కూడా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో జోగి రమేష్ కుటుంబం చుట్టూ అగ్రీగోల్డ్ భూముల ఉచ్చు మరింత బిగుస్తున్న పరిణామాలు కనిపిస్తున్నాయి.

ఫోర్జరీ కేసు నమోదు

జోగి రమేష్ కుటుంబం ఎవరి దగ్గర నుంచి అగ్రి గోల్డ్ భూములను కొన్నట్లుగా చెబుతున్నారో ఆ వ్యక్తిని ఏసీబీ గుర్తించింది. అతనిని ప్రశ్నించగా భూమిని తాను అమ్మలేదని, అవి నకిలీ దస్త్రాలు అని అతను ఏసీబీకి వివరించారు. దీంతో జోగి కుటుంబంపై ఫోర్జరీ కేసు కూడా నమోదు చేయాలని ఏసీబీ నిర్ణయించుకుంది. ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. దాదాపు రూ.10 కోట్ల విలువైన భూములను ఫోర్జరీ ద్వారా కబ్జా చేసి విక్రయించినట్లు జోగి కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటోంది.

విక్రయాలు ఎలా జరిగాయంటే..

జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పేర్లపై కొన్న 2 వేల 160 గజాల స్థలాన్ని వైసీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబానికి విక్రయించారు. సర్వే నెంబర్ 88లో కొనుగోలు చేసిన భూమిని రెవెన్యూ అధికారు సహకారంతో సర్వే నెంబర్ 87లో ఉన్నట్లు లేఖ తీసుకుని, స్వీయ సవరణ ద్వారా సబ్‌రిజిస్ట్రార్ సహకారంతో రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్ళీ విక్రయించారు. వాస్తవానికి సర్వే నెంబర్ 88లో బొమ్మా వెంకటచలమారెడ్డి పేరిట నాలుగు ఎకరాల భూమి ఉండేది. ఈ స్థలంలాన్ని పోలవరపు మురళీమోహన్‌కు ఒక ఎకరం, అద్దెపల్లి కిరణ్ కుమార్‌కు ఒక ఎకరం, రామిశెట్టి రాంబాబుకు రెండు రెండు ఎకరాల స్థలాన్ని 2001లో విక్రయించారు.

అదే 2 వేల 301 చదరపు గజాల స్థలాన్ని పోలవరపు మురళీమోహన్.. 2003, 2004 సంవత్సరాల్లో 11 మందికి విక్రయించారు. ఆ ప్లాట్లన్నీ కూడా సర్వే నెంబర్ 88లోనే ఉన్నాయి. అదే పోలవరపు మురళీ.. ఆ స్థలాన్ని 2022లో జోగి రమేష్ కుటుంబీకులకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. దీంతో ఏసీబీ అధికారులు మురళీ మోహన్‌ను కూడా నిందుతుల జాబితాలో చేర్చారు. కాగా ఆ విక్రయానికి తనకు సంబంధం లేదని, ఆ డాక్యుమెంట్లన్నీ నకిలీవని మురళీ తన వాంగ్మూలంలో వెల్లడించారు.

డాక్యుమెంట్లలో ఉన్న తన ఆధార్ నెంబర్ చివరి అంకెలు, అసలు ఆధార్ నెంబర్ చివరి అంకెలు ఒకటి కాదని మురళీ.. అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. డాక్యుమెంట్లలో పేర్కొన్న ఆధార్ నెంబర్.. కర్రి రత్నం అనే పేరుతో ఉంది. దీంతో కర్రి రత్నం అనే వ్యక్తిని విచారించడానికి ఏసీబీ ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై గ్రామ సర్వేయర్ దేదీప్యను ప్రశ్నించగా తాను అసలు సర్వేనే చేయలేదని, తన సంతకాలను ఫోర్జరీ చేశారని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. నిజానికి సర్వే సమయంలో భూ యజమానులకు నోటీసులు జారీ చేయాలి. కానీ నోటీసులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ఫోర్జరీ చేశారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపైనే ప్రస్తుతం దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేసినట్లు అధికారులు వివరించారు.

అగ్రిగోల్డ్ భూముల వ్యవహరాంలో ఫోర్జరీ కోణం బయటపడటంతో జోగి రమేష్ కుటుంబం చుట్టూ ఉచ్చు మరింత బిగుతుగా బిగుస్తుందని అంతా చర్చ నడుస్తోంది. అంతే కాకుండా భూముల కొనుగోలు విషయంలో జోగి రమేష్, జోగి రాజేష్ వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉండటం కూడా వీరిపై అనుమానాలు మరింత అధికం చేస్తున్నాయి. అందరిలానే తామూ భూములు కొన్నామని జోగి రాజీవ్ చెప్పగా.. అప్పటికే ఆ భూములు అటాచ్‌లో ఉన్నాయని.. అటాచ్‌లో ఉన్న భూములను ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇందులో కొత్త కోణం వెలుగు చూడటంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజీవ్ కస్టడీ కోరిన ఏసీబీ

రాజీవ్ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగానే రాజీవ్‌పై ఏసీబీ నమోదు చేసిన చట్టం చెల్లదని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ కేసులో ఏసీబీ తరపున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) ఆనంద జ్యోతి ఈ వాదనలను తోసిపుచ్చారు. మాజీ మంత్రిగా తన అధికారాన్ని అడ్డుపెట్టుకునే జోగి రమేష్ ఈ వ్యవహరాన్ని నడిపించారని పీపీ వాదించారు. ఈ సందర్భంగానే ఈ కేసుకు సంబంధించి రాజీవ్‌ను విచారించాల్సి ఉండగా ఏసీబీకి రాజీవ్ కస్టడీ అందించాలని కోరారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదు చేసిన ప్రతి సెక్షన్ చెల్లుతుందని, మాజీ మంత్రి తనయుడిగా ఈ సెక్షన్లు వర్తిస్తాయని ఆనంద జ్యోతి పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే భూముల కొనుగోలుతో తాము నష్టపోయామంటూ రాజీవ్ తరను న్యాయవాది వాదించడంతో కొనుగోలుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఆనంద జ్యోతి కోరారు. అంతేకాకుండా భూమిని కొనుగోలు చేస్తే అందుకు సంబంధించి ఆదాయ ధృవీకరణను చూపించాలని, ఐటీ రిటర్న్‌లలో వాటిని దాఖలు చేశారో లేదో స్పష్టం చేయాలని ఏసీబీ పీపీ ప్రశ్నించారు. దాదాపు రూ.1.60 లక్షల విలువైన రిజిస్ట్రేషన్ విలువకు సంబంధించిన ఆధారాలు చూపాలని పిటిషనర్లను కోరారు.

Read More
Next Story