
ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద ప్రవాహం–ఎగరనున్న మొదటి ప్రమాద హెచ్చరిక
రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద దాదాపు మొదటి హెచ్చరిక స్థాయి వరకు చేరనున్నదని, నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
మయన్మార్–దక్షిణ బంగ్లాదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న ఈశాన్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆయన తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. సెప్టెంబరు 25 గురువారం నాటికి తూర్పుమధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇది పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబరు 26 శుక్రవారం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది సెప్టెంబర్ 27 శనివారం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.
దీని ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.వేటకు వెళ్లిన మత్స్యకారులు బుధవారం లోపు తిరిగి రావాలని సూచించారు. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెప్టెంబరు 22 సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు.
ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రకాశం(జి) సింగరాయకొండలో 69.5మిమీ, చిత్తూరు(జి) యడమర్రిలో 61మిమీ, బాపట్ల(జి) మూల్పూరులో 60.5మిమీ,గుంటూరు(జి) తెనాలిలో 58.2మిమీ, మన్యం(జి) గంగన్నదొర వలసలో 57మిమీ,నెల్లూరు(జి) కారేడులో 55మిమీ,ప్రకాశం(జి) దర్శి, పల్నాడు(జి) బెల్లంకొండ, విజయనగరం(జి) గార్భంలో 54మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.
Next Story