
శ్రీశైలం రిజర్వాయర్ (పాత చిత్రం)
శ్రీశైలం రిజర్వాయర్ వద్ద పెరిగిన వరద ప్రవాహం- సందర్శకుల తాకిడి
శ్రీశైలం రిజర్వాయర్ కు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో రెండు గెట్లను ఎత్తి నీళ్లను నాగార్జున సాగర్ లోకి వదులుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో మరో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఎక్కువగా వస్తుండడంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,27,392 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులు. రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా నమోదైంది.
శ్రీశైలం వద్ద గేట్లను ఎత్తివేయడంతో సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. గేట్లను ఎత్తి నీటి విడుదల సాగుతుండడంతో శ్రీశైలం వద్ద అనుపమానమైన ప్రకృతి దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. నీరు ఎగిసిపడే దృశ్యాలను చూసేందుకు స్థానికులతో పాటు పర్యాటకులు గణనీయంగా వచ్చారు. పోలీసు, నీటిపారుదల శాఖలు కలసి ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు చేపడుతున్నారు.
Next Story