ఉత్తరాంధ్రకు ఆకస్మిక వరద హెచ్చరిక!
x

ఉత్తరాంధ్రకు ఆకస్మిక వరద హెచ్చరిక!

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ


భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ఉత్తరాంధ్ర వణుకుతోంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నదుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిలోకి వరద ఎక్కువగా చేరుతుండటం.. ఫ్లాష్‌ ఫ్లడ్‌ ముప్పు ఉన్నందున 10 మండలాల్లోని విద్యాసంస్థలకు శుక్రవారం (అక్టోబర్ 3) సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గార, సరుబుజ్జిలి, ఎల్‌.ఎన్‌.పేట మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తీరం దాటిన తుపాను..
ఒడిశాలోని గోపాల్‌పూర్‌ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య దిశగా కదిలి బలహీన పడుతున్నట్లు పేర్కొంది. తీరం దాటినా తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.
మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉద్ధృతి పెరిగింది. అటు నుంచి వచ్చిన నీరు వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదుల్లో చేరుతోంది. దీంతో హిర మండలం గొట్టా బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక చేశారు. ఆ బ్యారేజీ నుంచి వచ్చిన వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది.
మహేంద్రతనయ నదిలో పెరిగిన నీటి ప్రవాహం కారణంగా శ్రీకాకుళం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌, మహేంద్రనగర్‌ వీధిలోకి వరద వచ్చి చేరింది. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.
Read More
Next Story