మెగా డిఎస్సీపైనే మొదటి సంతకం
x

మెగా డిఎస్సీపైనే మొదటి సంతకం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మొదటి సంతకాన్ని మెగా డిఎస్సీపైనే పెట్టనున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం బాధ్యతలు తీసుకుంటారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా గురువారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం వెంకటేశ్వస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకాలు సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే చేయనున్నారు. మెగా డిఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛన్‌ల పెంపు ఫైల్స్‌పై సంతకాలు చేయనున్నారు. అలాగే అన్న క్యాంటిన్ల పునరుద్దరణ ఫైల్‌పై కూడా సంతకం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి సంతకాలు చేసే ఫైల్స్‌ను అధికారులు రెడీ చేసి సిద్ధంగా ఉంచారు. సీఎం తిరుమల నుంచి వచ్చిన తరువాత సచివాలయంలో ఈ సంతకాలు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం 4.41 గంటలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు.
మెగా డిఎస్సీపైనే మొదటి సంతకం
తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టగానే మెగా డిఎస్సీ ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. లోకేష్‌ కూడా ఇదే హామీని పలు సందర్భాల్లో చెప్పారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా మెగా డిఎస్సీ విషయం పలు మార్లు చెప్పారు. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు, నిరుద్యోగుల్లో ఉన్న ఆందోలన పోగొట్టేందుకు మెగా డిఎస్సీపై మొదటి సంతకం సీఎం చంద్రబాబు చేయనున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఉన్నతాధికారులు చెప్పారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 13వేలకు పైగా పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక తయారు చేశారు. ఉన్నతాధికారులతో చంద్రబాబు చర్చించిన తరువాత విద్యాశాఖ ప్రత్యేకంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.
ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు
రాష్ట్ర ప్రజల్లో భయం సృష్టించిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ చట్టాన్ని రద్దు చే యాల్సి ఉంది. ఇప్పటికే పలు మార్లు ఈ చట్టంలోని లోపాలను ప్రజలకు ఎన్నికల ప్రచారంలో వివరించారు. ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములు కాజేసేందుకు వివిధ సెక్షన్లను పొందుపరిచారని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పలు మార్లు ఆరోపణలు చేసింది. ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు పలు సందర్భాల్లో చర్చా వేదికలపై చెప్పుకొచ్చారు. పాసు పుస్తకాలపై ప్రభుత్వ లోగోకు బదులు వైఎస్‌ జగన్‌ బొమ్మను బ్యాగ్రవుండ్‌లో ఉంచారని, దీనిని కూడా తొలగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
పింఛన్‌ పెంపుపై సంతకం..
వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ను నూతన ప్రభుత్వం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్య, వితంతు పింఛన్‌లను రూ. 4వేలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సీఎం ఈ ఫైల్‌పై సంతకం చేయనున్నారు. పెంచిన పింఛన్‌ను ఏప్రిల్‌ నుంచి అమలులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంచుతామని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు జులై 1న రూ.7 వేలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. పూటకు రూ.5 చొప్పున మూడు పూటలకూ కలిపి రూ.15కే అన్నం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 2.50 లక్షల మందికి అల్పాహారం, భోజనం అందించే వారు. అప్పటి ప్రభుత్వం ఇందుకోసం రూ. 31.06 కోట్లు ఖర్చు పెట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే అన్న క్యాంటిన్లను ఎత్తివేసింది. వీటిని చంద్రబాబు తిరిగి పునరుద్ధరించేందుకు సంతకం చేయనున్నారు.
Read More
Next Story