భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఎగరనున్న తొలి ఫ్లైట్‌!
x
భోగాపురం ఎయిర్‌పోర్టు ఇలా ఉండనుంది.

భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఎగరనున్న తొలి ఫ్లైట్‌!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కీలకమైన ఫ్లైట్‌ ట్రయల్‌ రన్‌కు ముహూర్తం కుదిరింది.

దాదాపు దశాబ్ద కాలం క్రితం తలపెట్టిన భోగాపురం ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు అవాంతరాలను అధిగమిస్తూ కీలక అంకానికి చేరుకుంది. ఇప్పటికే 95 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ విమానాశ్రయం ట్రయల్‌ రన్‌కు సిద్ధమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇందుకు ముహూర్తం కుదిరింది. ఆ సమయానికి ఢిల్లీ నుంచి ఎయిరిండియా బోయింగ్‌ మోడల్‌ కమర్షియల్‌ ఫ్లైట్‌ ఈ ఎయిర్‌పోర్టు రన్‌వేపై ల్యాండ్‌ అవుతుంది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) శాఖల ఉన్నతాధికారులు వస్తున్నారు. వీరు ఈ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు సన్నద్ధత, నేవిగేషన్‌ సిస్టం, ఎయిర్‌పోర్టు ఆపరేషన్స్‌ వంటి వాటిని పరిశీలిస్తారు. ట్రయల్‌ రన్‌ కోసం ప్రత్యేక విమానంలో వస్తున్న వారికి ఘన స్వాగతం పలకడానికి స్థానికులు, శ్రీకాకుళం జిల్లా వాసులు సన్నద్ధమవుతున్నారు.

టెర్మినల్‌ లోపలి భాగం ఈ తరహాలో.

95 శాతం ఎయిర్‌పోర్టు పనులు పూర్తి..
ఈ ఎయిర్‌పోర్టులో దాదాపు 95 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రధానమైన రన్‌వే, ట్యాక్సీ వే, ఎర్త్‌వర్క్‌ పనులు నూరు శాతం పనులు పూర్తయ్యాయి. ఆధునిక టెర్మినల్‌ భవనం, ప్రధాన బిల్డింగ్‌ పనులు, మెయిన్‌ అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం, లోకలైజర్‌‡, నేవిగేషన్‌ సిస్టమ్స్‌ ఫైనల్‌ దశలో ఉన్నాయి. రాడార్‌ సిగ్నల్స్, ఏటీసీ వ్యవస్థలు, జీపీఎస్‌ నేవిగేషన్, లోకలైజర్‌ వాతావరణ పరికరాలను ఇప్పటికే టెస్టింగ్‌ చేశారు. ఇంకా చిన్న చిన్న మైనర్‌ పనులు జరుగుతున్నాయి. వీటిని పూర్తి చేయడానికి రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.

పూర్తికావస్తున్న టెర్మినల్‌ భవనం

ఎయిర్‌పోర్టు పూర్తికి పదేళ్ల సమయం..
భోగాపురం ఎయిర్‌పోర్టుకు 2015 మే 20న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలిసారిగా ఆమోదం తెలిపింది. ఈ విమానాశ్రయం నిర్మాణానికి 2016 అక్టోబర్‌ 7న కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తొలుత ఈ ఎయిర్‌పోర్టును 2023 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వాలు మారడం, రైతుల నుంచి సేకరించిన భూమికిచ్చే పరిహారంలో జాప్యం వంటివి ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం ఆలస్యమైంది. ఇలా ఈ విమానాశ్రయాన్ని తలపెట్టిన పదేళ్ల నాటికి ప్రారంభించేందుకు సమయం పట్టింది.

టెర్మినల్‌ లోపలి భాగం ఈ తరహాలో.

ఆరు నెలలు ముందే అందుబాటులోకి..
మారిన అంచనాల ప్రకారం.. ఈ ఏడాది డిసెంబరు నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావలసి ఉంది. కానీ ఆరు నెలలు ముందే అంటే మే నెలలోనే దీనిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు నెలల క్రితం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా బీచ్‌క్రాఫ్ట్‌ కింగ్‌ ఎయిర్‌–360 ఎయిర్‌క్రాఫ్ట్‌ను సాంకేతిక ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. ఇప్పుడు ప్రధానమైన ట్రయల్‌ రన్‌ను ఆదివారం చేపట్టనున్నారు. తొలుత జూన్‌ నుంచి కమర్షియల్‌ ఫ్లైట్లు, ఆగస్టు నుంచి ప్రయాణికుల విమానాలు రాకపోకలు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.

విమానాశ్రయం రన్‌వే..

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రత్యేకతలివీ..
భోగాపురం విమానాశ్రయం నిర్మాణం 2,203 ఎకరాల్లో జరుగుతోంది. ఎయిర్‌పోర్టుల నిర్మాణంలో పేర్గాంచిన జీఎమ్మార్‌ సంస్థ ఈ భోగాపురం ఎయిపోర్టును నిర్మిస్తోంది. టెర్మినల్‌ భవనం 81 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఏరో బ్రిడ్జిలు 22 కాగా, ప్రారంభంలో ఏడాదికి 60 లక్షల మందికి, రెండో దశలో 1.20 కోట్ల మంది రాకపోకలు సాగించేలా సామర్థ్యాన్ని పెంచనున్నారు. తొలిదశలో దీని నిర్మాణ వ్యయం రూ.4,750 కోట్లు. రన్‌వే పొడవు 3,800 మీటర్లు.. అంటే 3.8 కి.మీలన్న మాట! దూరప్రాంతాలకు వెళ్లే ఎయిర్‌ బస్‌ ఎ380 వంటి భారీ విమానాల రాకపోకలకు.. కమర్షియల్‌ ఫ్లైట్లు కూడా టేకాఫ్, ల్యాండింగ్‌లకు వీలుగా పొడవైన రన్‌వే నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటివరకు 4.43 కి.మీలతో దేశంలో అత్యంత పొడవైన రన్‌వే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు ఉంది. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు 4.26 కి.మీలు, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం 4.0 కి.మీలతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వాటి తర్వాత పొడవైన రన్‌వే భోగాపురం ఎయిర్‌పోర్టుకే సొంతం.
రెండు సార్లు శంకుస్థాపనలు..
భోగాపురం విమానాశ్రయానికి 2019 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. మళ్లీ 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి భూమి పూజ చేశారు. దీంతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రెండుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఈ విమానాశ్రయం కోసం 2,708.25 ఎకరాలు కేటాయించారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్రంలో విమానయాన∙శాఖ మంత్రి చేపట్టడం ఈ విమానాశ్రయం పనులు వేగం పుంజుకోవడంతో పాటు సత్వరమే అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారు. ఈ విమానాశ్రయానికి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు.
విశాఖపట్నం–శ్రీకాకుళంల మధ్య..
భోగాపురం ఎయిర్‌పోర్టు విశాఖపట్నం, శ్రీకాకుళం నగరాలకు మధ్యలో ఉంది. ఇది విశాఖపట్నానికి 50 కి.మీలు, విజయనగరానికి 25 కి.మీలు, శ్రీకాకుళానికి 55 కి.మీల దూరంలో ఉంది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో మూడో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అవుతుంది. ఇప్పటికే ఏపీలో విశాఖపట్నం, విజయవాడలు అంతర్జాతీయ విమానాశ్రయ కేటగిరీలో ఉన్నాయి.
Read More
Next Story