
ప్రకాశం బ్యారేజీ వద్ద మళ్లీ ఎగిరిన మొదటి ప్రమాద హెచ్చరిక
కృష్ణా వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది వరద నీటి ప్రవాహం ఉధృతి భారీగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటి ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో గురువారం మధ్యాహ్నం ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో వైపు కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదిపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు ప్రజలకు ప్రఖర్ జైన్ సూచించారు.
ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న భారీ వరద నీటి ప్రవాహం వల్ల ఇప్పటికే 69 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం ఉదయం నాటికి ప్రకాశం బ్యారేజీలోకి 3.03లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం ఉండగా, దాదాపు 2.97లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం సమయానికి ఈ వరద నటి ప్రవాహం ఇంకా పెరిగింది. 4.05లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలు 4.05లక్షల క్యూసెక్కులకు చేరింది, దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.
Next Story