మూసీ నిద్రపై కాంగ్రెస్-బీజేపీ మధ్య మంటలు
x

మూసీ నిద్రపై కాంగ్రెస్-బీజేపీ మధ్య మంటలు

వీళ్ళందరికీ భోజనాలకు ఇళ్ళల్లోని యాజమానులకు ఎంత ఖర్చవుతుందో చూడాలి. లేకపోతే వెళుతున్న నేతలే తమతో పాటు ఇళ్ళల్లోని వాళ్ళకు కూడా భోజనాలను పట్టుకుని వెళతారేమో.


మూసీనదినిద్ర కాదుకాని అధికార కాంగ్రెస్-ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మంటలు రేగుతున్నాయి. రేవంత్ రెడ్డి సవాలు ప్రకారమే తాము మూసీనది(Musi river) ప్రాంతంలోని ఇళ్ళల్లో నిద్రిస్తామని కేంద్రమంత్రి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(KishanReddy) శుక్రవారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించటమే కాకుండా శనివారం సాయంత్రం 4 గంటల నుండి ఆదివారం ఉదయం 8 గంటలవరకు మూసీనది పరివాహక ప్రాంతంలోని పేదల ఇళ్ళల్లోనే భోజనాలు చేస్తాము, పడుకుని నిద్రపోతామని ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతంలోని 20 ప్రాంతాల్లో భోజనాలు చేసి, నిద్ర చేయబోయే 20 మంది నేతల పేర్లను కూడా పార్టీ ప్రకటించింది. వీళ్ళంతా తమ మద్దతుదారులతో ఈరోజు సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు పేదల ఇళ్ళల్లో ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ భోజనాలకు ఇళ్ళల్లోని యాజమానులకు ఎంత ఖర్చవుతుందో చూడాలి. లేకపోతే వెళుతున్న నేతలే తమతో పాటు ఇళ్ళల్లోని వాళ్ళకు కూడా భోజనాలను పట్టుకుని వెళతారేమో.

ఎప్పుడైతే రేవంత్(Revanth) ఛాలెంజ్ ను బీజేపీ సీరియస్ గా తీసుకున్నదో వెంటనే హస్తంపార్టీ నేతలు మాటలదాడులు మొదలుపెట్టేశారు. కేంద్రమంత్రి, ఎంపీల హోదాలో పేదల ఇళ్ళల్లో ఉండటం కాకుండా సామాన్యుల్లాగ పేదల ఇళ్ళల్లో ఉండాలని గోల మొదలుపెట్టారు. ఎంఎల్ఏగా ఉన్నంతకాలం మూసీనది ప్రాంతంలోని పేదలగురించి పట్టించుకోని కిషన్ ఇపుడు సడెన్ గా మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టును రాజకీయం చేస్తున్నారంటు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. రేవంత్ సంకల్పాన్ని దెబ్బతీయాలన్న కుట్రతోనే బీజేపీ నేతలు మూసీనది నిద్ర డ్రామా చేస్తున్నట్లు ఎద్దేవా చేస్తున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంఎల్సీ బల్మూరి వెంకట్, సీనియర్ నేత గాలి అనీల్ కుమార్ తదితరులు కిషన్ రెడ్డి తదితరులపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టుకు కేంద్రంనుండి కిషన్ నిదులు తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కరోజు నిద్రించటం వల్ల ఏమవుతుంది మూడు నెలలు నిద్రించాలని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ PCC president Bomma Mahesh kumar goud) తదితరులు కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.

ఇదేసమయంలో కాంగ్రెస్ నేతల ఆరోపణలు, విమర్శలపై కమలంపార్టీ నేతలు ఎదురుదాడులు మొదలుపెట్టారు. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు ముసుగులో కోట్లాది రూపాయలను దోచుకోవటానికే రేవంత్ అండ్ కో ప్లాన్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. మూసీనది నిద్ర విషయంలో రేవంత్ ఛాలెంజ్ ను తాము స్వీకరించటాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నట్లు కిషన్ మండిపడ్డారు. మూసీ ప్రాంతంలో ఒక్కరోజు కాదని మూడునెలలు నిద్రించటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కిషన్ గట్టిగానే బదులిస్తున్నారు. మొత్తంమీద బీజేపీ(BJP) నేతలు మూసీనది ప్రాంతంలో నిద్రించటం ఏమోగాని రెండుపార్టీల మధ్య మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. మరి ఆదివారం ఉదయం నిద్ర తర్వాత ఇంకేమి పుట్టిస్తారో చూడాలి.

Read More
Next Story