
ఏపీ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్
రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ఆంధప్రదేశ్ రాజధాని అమరావతి సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ఏపీఎస్‌పీఎఫ్ సిబ్బంది ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ఏపీఎస్‌పీఎప్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే అమరావతి సచివాలయం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏపీఎస్‌పీఎఫ్ సిబ్బంది సహకారంతో రంగంలోకి దిగిన అగ్నిమాక బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అమరావతి సచివాలయంలోని కీలకమైన రెండో బ్లాక్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బ్లాక్‌లో ఏడుగురు మంత్రుల పేషీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజమ్ శాఖ మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, హోం శాఖ మంత్రి మంత్రి వంగలపూడి అనితల పేషీలు ఈ రెండో బ్లాక్‌లోనే ఉన్నాయి. ఇంత మంది కీలక మంత్రుల పేషీలు ఉన్న రెండో బ్లాక్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మరో వైపు ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. సాక్షాత్తు సచివాలయంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్క సారిగా ఉలిక్కపాటుకు గురి చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తయ్యారు. కఠిన చర్యలకు ఉపక్రమించారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు. సచివాలయంలోనికి వెళ్లేందుకు మీడియాను కూడా లోపలికి అనుమతించడంలేదు. సచివాలయం ఉద్యోగులు, సిబ్బందైనా సరే ఐడీ కార్డులు చూపించిన తర్వాతనే లోపలికి అనుమతించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాల మీద పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాద వశాత్తు ఈ అగ్ని ప్రమాదం జరిగిందా? లేదా దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అగ్నిప్రమాదం జరిగిన సమయంలో సిబ్బంది ఎవరూ కార్యాలయంలో లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.
Next Story