
విజయవాడలో తన స్థలాన్ని కబ్జా చేశారంటూ ఆరోపించిన శాస్త్రీ (కుడిపక్కన) గౌతంరెడ్డి (ఎడమ)
ATTEMPT TO MURDER | వైసీపీ నేత గౌతమ్ రెడ్డి అరెస్ట్ తప్పదా?
వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిసెంబర్ 11న కొట్టివేసింది. హత్యాయత్నం కేసులో (ATTEMPT TO MURDER) ఆయన నిందితుడిగా ఉన్నారు.
వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిసెంబర్ 11న కొట్టివేసింది. విజయవాడకు చెందిన ఉమామహేశ్వర శాస్త్రిపై హత్యాయత్నం కేసులో (ATTEMPT TO MURDER) ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఆయన అరెస్ట్ తప్పదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తప్పుడు పత్రాలతో భూములు అక్రమించి నిర్మాణాలు చేపట్టడమేగాక న్యాయపోరాటం చేస్తున్న భూ యజమానిని అంతమొందించేందుకు ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతంరెడ్డి కుట్రపన్నారనేది ఆరోపణ. బెయిల్ పిటిషన్ కోర్టు ముందు ఉండడంతో పోలీసులు ఇంతకాలం ఆయన్ను వదిలివేశారని, ఇకపై చర్యలు తప్పకపోవచ్చునని రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి.
కోట్ల రూపాయల విలువైన స్థలాలను తప్పుడు పత్రాలతో వశపరుచుకోవడం, ఎదురు తిరిగిన వారిని అంతమొందించేందుకు ప్రయత్నం చేసినట్టు గౌతమ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విజయవాడలో 5 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వైసీపీ నేత గౌతంరెడ్డి కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు ప్రాధమిక విచారణ జరిపారు. బాధితుడు సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిరాయి హంతకుల ముఠాకు చెందిన వారిగా భావిస్తున్న నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదైన తర్వాత గౌతమ్ రెడ్డి పరారీ అయ్యారన్న వదంతులు కూడా వచ్చాయి.
విజయవాడలోని సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గండూరి ఉమామహేశ్వరశాస్త్రి తన తల్లి పేరిట లక్ష్మీనగర్‌లో 325 చదరపు అడుగుల స్థలాన్ని 2014లో కొనుగోలు చేశారు. అయితే ఈ స్థలం తమదంటూ గౌతమ్ రెడ్డి ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేశారని ఉమామహేశ్వరశాస్త్రి ఆరోపించారు. ఏడేళ్లుగా ఈ వ్యవహారంపై ఇరువురి మధ్య వివాదం నడుస్తోంది.
వైసీపీ అధికారంలో ఉండగా గౌతమ్ రెడ్డి విజయవాడ నగరపాలకసంస్థ నుంచి అనుమతి తెచ్చుకుని గ్రౌండ్‌ప్లోర్‌తో పాటు రెండంతస్తుల భవనం నిర్మించారు. దీనిపై ఉమామహేశ్వరశాస్త్రి 2017లో సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టగా గౌతమ్ రెడ్డి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బాధితుడు ఎడతెగని న్యాయ పోరాటంతో రెండో అంతస్తు కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మరోసారి హైకోర్టుకు వెళ్లిన గౌతమ్ రెడ్డి 4 వారాల వరకు యథాతథ స్థితి ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఆగని న్యాయపోరాటం...
ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఉమామహేశ్వర శాస్త్రి న్యాయపోరాటం ఆపలేదు. కోట్లాది రూపాయల విలువైన స్థలం చేజారిపోతుందని భావించిన గౌతమ్ రెడ్డి తన డ్రైవర్ బందా శ్రీను ద్వారా తనను అంతమొందించడానికి కుట్రపన్నారని 24 లక్షల రూపాయల సుపారీ ఇచ్చారంటూ ఉమామహేశ్వర శాస్త్రి ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నవంబర్ 6న మధ్యాహ్నం ఇంటి గోడ దూకి లోపలికి వచ్చి కత్తితో దాడి చేసి ఇంటి స్థలం ఒరిజినల్ పత్రాలు, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారని బాధితుడు వాపోయాడు. అదే రోజు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా గౌతమ్‌రెడ్డి, బందా శ్రీనుతోపాటు మరో నలుగురిపై హత్యాయత్నం, దోపిడీ కేసు నమోదైంది.
సీసీ ఫుటేజ్ ఆధారంగా జగ్గయ్యపేట, చిల్లకల్లుకు చెందిన గెడ్డం వినోద్, తాళ్లూరి గణేష్, దేవళ్ల వంశీ, ఉప్పతోళ్ల అశోక్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడైన గౌతమ్ రెడ్డితో పాటు మిగిలిన వారు పరారీ అయ్యారు. ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను హైకోర్టు డిసెంబర్ 11న కొట్టి వేసింది. దీంతో గౌతమ్ రెడ్డి అరెస్ట్ అనివార్యంగా కనిపిస్తోంది.
Next Story