ఏపీలో మహిళలకు పండుగ–ఆగస్టు 15 నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం
x

ఏపీలో మహిళలకు పండుగ–ఆగస్టు 15 నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం

ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రమాణం చేయించారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళలకు సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కర్నూలు జిల్లా పాణ్యంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీక్యాంప్‌ రైతుబజార్‌కు సీఎం వెళ్లారు. అక్కడ రైతులు, పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారు చేసే విధానాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం ఉద్యానవన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలలోని మూడో శనివారం నాడు ఇళ్లు, చుట్టుపక్కల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, ఆ విధంగా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగస్తులు కూడా దీనిని పాటించేలా చూడాలని సూచించారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో 1999లో రైతుబజార్లను తానే ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు రావాలని, అదేసమయంలో వినియోగదారులకు కూడా తక్కువ ధరలకే నాణ్యమైన కూరగాయల ఉత్పత్తులు అందుబాటులో ఉంచాలనే ఓ సదుద్దేశంతో నాడు రైతుబజార్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నాడు తీసుకొచ్చిన ఈ రైతుబజార్ల వల్ల రైతులు ఎంతో లబ్ధి పొందారని, దీంతో పాటుగా వినియోగదారులకు కూడా మేలు జరిగిందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 125 రైతు బజార్లు ఉన్నాయని, కర్నూలు సీ క్యాంపు రైతు బజారును రూ. 6 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లోనే ఆదర్శవంతమైన రైతు బజారుగా తీర్చిదిద్దుతామన్నారు. దీనికి పక్కనే ఉన్న స్థలంలో అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ను కూడా కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గాల్లో 175 రైతు బజార్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రైతు బజార్లకు సేంద్రీయ విధానంలో పండించిన కూరగాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
త్వరలో విశాఖ తీరంలో అంతర్జాతీయ యోగా డేను నిర్వహిస్తున్నామని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. నెల రోజుల పాటు ఈ యోగా డేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా మీద ప్రజలకు శిక్షణ ఇస్తామని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం కోసం రోజుకు అరగంట యోగా చేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. అక్టోబరు 2 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా కూడా చెత్త లేకుండా చూస్తామన్నారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చానన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలని, చెత్త నుంచి కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం రెండు ప్రాజెక్టులు పని చేస్తున్నాయని, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడపలో కూడా ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విధానంలో డ్వాక్రా, మెప్మా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారబోతున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read More
Next Story