
గంజాయి గ్యాంగ్‌ను పట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి గంజాయి బ్యాచ్‌ను పోలీసులకు పట్టించారు.
గుంటూరులో కరుడు గట్టిన గంజాయి గ్యాంగ్‌ను టీడీపీ మహిళా ఎమ్మెల్యే పోలీసులకు పట్టించారు. గంజాయి సేవిస్తూ నిత్యం మహిళలపై వేధింపులకు ఈ బ్యాచ్ పాల్పడుతోంది. ఈ విషయాన్ని ఇది వరకే గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి దృష్టికి వచ్చింది. నగంలోని రెడ్డి కాలేజీ ప్రాంగణంలో కొందరు యువకులు గంజాయి సేవిస్తూ ఆ ప్రాంతంలోని మహిళలను, యువతులను వేధిస్తున్నట్లు బాధితులు ఎమ్మెల్యే మాధవి దృష్టికి తీసుకొచ్చారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎమ్మెల్యే మాధవి తక్షణమే స్పందించారు. స్వయంగా రెడ్డి కాలేజీకి వెళ్లారు. కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించారు. ముగ్గురు ఆకతాయిలను గమనించిన ఎమ్మెల్యే వెంటనే అక్కడికి పోలీసులను పిలిపించారు. కాలేజీకి చేరుకున్న పోలీసులు ఆ ముగ్గురు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. యువతులు, మహిళలను వేధింపులకు గురి చేసే వారిని వదలొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె సూచించారు. అంతేకాకుండా గుంటూరులో గంజాయి ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పెట్రోలింగ్ పెంచాలని, గంజాయి బ్యాచ్‌ల ఆటకట్టించాలని పోలీసులకు ఆమె సూచించారు.