మహిళా అధ్యాపకుల లైంగిక వేధింపులు..డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
x

మహిళా అధ్యాపకుల లైంగిక వేధింపులు..డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

సాయితేజ క్లాస్ టీచర్, స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు మంచి మిత్రులు.


ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో దారుణ ఘటన జరిగింది. సమతా డిగ్రీ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల సాయితేజ శుక్రవారం ఉదయం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు మహిళా అధ్యాపకులు (స్టాటిస్టిక్స్ లెక్చరర్, క్లాస్ టీచర్) మానసిక, లైంగిక వేధింపులే కారణమని కుటుంబం, సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆ మహిళా అధ్యాపకులు సాయితేజతో చేసిన వాట్సాప్ చాటింగ్‌లు, మెసేజ్‌లు సాక్ష్యాలుగా పోలీసులకు అందాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు ఆందోళన చేపట్టి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

దారుణ ఘటన వివరాలు

ఎంవీపీ కాలనీ నాలుగో సెక్టార్‌లో నివసించే ఆటో డ్రైవర్ కోన సూరిబాబు పెద్ద కుమారుడు సాయితేజ (22) సమతా డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్/స్టాటిస్టిక్స్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 5వ సెమిస్టర్ పరీక్షల తర్వాత అధ్యాపకుల వేధింపులు మొదలయ్యాయి. పరీక్షల్లో బాగా రాసినా మార్కులు వేయకుండా, రికార్డులు అధికంగా రాయించి సంతకాలు పెట్టకుండా వేధించారని సాయితేజ తల్లిదండ్రులకు చెప్పాడు.

శుక్రవారం ఉదయం అధ్యాపకుల వేధింపులపై యాజమాన్యంతో మాట్లాడటానికి సాయితేజ తల్లిదండ్రులు, అతని మామయ్య కాలేజీకి వెళ్లారు. అక్కడ ఉండగానే సాయితేజతో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి, అతడు ఫ్యాన్ హుక్‌కు ఉరివేసుకొని ఉన్నాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సాయితేజ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌లో పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.

లైంగిక, మానసిక వేధింపులపై ఆరోపణలు

అధ్యాపకుల లైంగిక, మానసిక వేధింపుల వల్లే సాయితేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ ఫిర్యాదులో క్లాస్ టీచర్ లైంగిక అవసరాల కోసం ఒత్తిడి తెచ్చిందని, ఆమె, స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు మంచి మిత్రులు అని పేర్కొన్నారు. "క్లాస్ టీచర్ లైంగిక అవసరాల కోసమే సాయితేజపై స్టాటిస్టిక్స్ అధ్యాపకురాలు ఒత్తిడి తెచ్చేవారు" అని ఆరోపించారు. వాట్సాప్ చాటింగ్‌లలో మానసిక ఒత్తిడి చేసే మెసేజ్‌లు ఉన్నాయి. "శైలు చనిపోయినప్పుడు వెళ్లావు కదా? నేను చనిపోయినప్పుడు వస్తావా? నేను కంప్లైయింట్ చేశానని కోపం వచ్చిందా? నువ్వు ఛేంజ్ అవ్వకపోతే కష్టం, ఎంత సేపు బాబాయ్ ఏం అంటారో అదే సోదా? ఈ లైఫ్‌లో మాట్లాడకూడదు. మొహం చూడకూడదు, మర్చిపోవాలి అని డిసైడ్ అయిపోయా!" అంటూ హింసాత్మకంగా వేధించారని పేర్కొన్నారు. సాయితేజ పలుసార్లు "ఇద్దరు అధ్యాపకులు కలసి వేధిస్తున్నారు" అని కుటుంబ సభ్యులకు చెప్పాడని అందులో పేర్కొన్నారు.

ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ ప్రసాద్ మేరకు, కుటుంబ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సాయితేజ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, వాట్సాప్ మెసేజ్‌లు, కాల్ డేటా, గత సంభాషణలపై ఆరా తీస్తున్నారు. "నిష్పాక్షిక విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటాము" అని పోలీసులు తెలిపారు. అయితే సమతా కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, "విద్యార్థి ముందే తమకు ఫిర్యాదు చేయలేదు. తెలిసి ఉంటే ఇంత వరకు విషయం వచ్చేది కాదు" అని చెప్పారు. ఈ ఘటన దుర్దృష్టకరమని, విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని యాజమాన్యం ప్రకటించింది. మరో వైపు సాయితేజ మరణ వార్త తెలిసిన వెంటనే సహచర విద్యార్థులు కాలేజీలో ఆందోళనకు దిగారు. "సాయితేజ మంచి విద్యార్థి. అధ్యాపకురాలి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి" అని డిమాండు చేశారు.

Read More
Next Story