ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీసీ విద్యార్థులకు సన్మానాలు
x

ఉత్తమ ప్రతిభ కనబరిచిన బీసీ విద్యార్థులకు సన్మానాలు

200 మందికి సర్టిఫికెట్స్, మెమొంటోలు, 22 మందికి నగదు పురస్కారాలు మంత్రి సవిత అందజేశారు.


ఏపీలో బీసీ విద్యార్ధుల విద్య కోసం బలమైన పునాదులు వేయటం వల్లే నేటి పదవ తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్ధులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని బీసీ, ఈడబ్యూఎస్‌ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్‌. సవిత తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన పదవ తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన బీసీ హాస్టల్స్, మహాత్మా జ్యోతీబా పూలే గురుకులాల విద్యార్ధులకు నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదవ తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన బీసీ సంక్షేమ, మహాత్మ జ్యోతీబా పూలే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించటం గర్వించదగ్గ విషయన్నారు. విద్యార్ధుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్ధులు మంచి ఫలితాలు రావలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. అందుకు అనుగుణంగా టీచర్లు, విద్యార్ధులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు.
తల్లికి వందనం క్రింద ప్రతి ఇంట్లో చదువుకునే ఆడబిడ్డకు జూన్‌ 15 న రూ. 15,000 అందిస్తామని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు, తదితర మౌలిక ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ హాస్టల్స్, మహాత్మా జ్యోతీబా పూలే గురుకులాల్లో టాయిలెట్స్‌ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది పది, ఇంటర్‌ ఫలితాల్లో బీసీ గురుకులాలు, హాస్టల్‌ విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచారన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అభినందనలన్నారు.
బీసీ యువతకు సివిల్‌ సర్వీసులో శిక్షణతోపాటు, మెగా డీఎస్సీకి శిక్షణను అందిస్తున్నామన్నారు. విదీశీ విద్యా కూడా అందిస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా మహాత్మ జ్యోతిబా పూలే గురుకులాల్లో చదివామనే చెప్పుకునేందుకు గర్వంగా ఉండాలని, అందరూ గర్వంగా చెప్పుకునేలా విద్యాలయాలను తీర్చి దిద్దుతున్నామన్నారు. పిల్లలకు ఇష్టమైన రంగంలో తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలన్నారు.
పాఠశాలలు తెరిచిన వెంటనే రాష్ట్రంలో అన్ని బీసీ సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. విద్యా దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్‌ త్యాగాలను మనందరం గుర్తుంచుకోవాలన్నారు. ముందుగా జ్యోతిబా పూలే, దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్‌ ల చిత్ర పటాలకు మంత్రి పూల మాలలు అర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, బీసీ సంక్షేమ హాస్టల్స్‌ నుంచి 200 మందికి బ్యాగులు, సర్టిఫికెట్స్, మెమొంటోలు అందించారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన 22 మందికి నగదు పురస్కారాలు అందించారు. ఇందులో 8 మంది బీసీ హాస్టల్స్‌ కు చెందినవారు కాగా 14 మంది ఎంజేపీ స్కూల్స్, కళాశాలలకు చెందినవారున్నారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల డాక్టర్‌ ఏ మల్లిఖార్జున్, మహాత్మా జ్యోతీబా పూలే గురుకులాల సొసైటీ కార్యదర్శి పీ. మాధవీలత, ఏ. కృష్ణ మోహన్, తదితరలు పాల్గొన్నారు.
Read More
Next Story