ఏపీ మంత్రుల్లో పని తీరు భయం
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు పని తీరు భయం పట్టుకుంది. రాక రాక వచ్చిన మంత్రి పదవి ఊడి పోతుందనే ఆందోళనలో ఉన్నారు. దీంతో పదవులను కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు.
చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మంత్రి వర్గంపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముగ్గురు మంత్రులకే మంచి మార్కులు వేశారు. తక్కిన వాళ్ల పని తీరు బాగ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పని తీరును మెరుగు పరుచుకోవాలని వార్నింగ్‌లు ఇచ్చారు. దీంతో రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి నుంచి రిమార్కు రాకుండా ఉండేలా పనిచేయాలంటే ఏమి చేయాలనే ఆందోళన మంత్రులందరిలో కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి దగ్గిర మార్కులు పడిపోతే, తదుపరి క్యాబినెట్ విస్తరణలో పదవి వూడిపోతుందనే భయం కూడా కొత్త మంత్రుల్లో మొదలయింది. దీని వల్ల కొత్తగా చేరిన మంత్రులు జాగ్రత్తగా మసలు కుంటారని, క్రమశిక్షణ అలవర్చుకుంటారని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో అధిక శాంత మంది కొత్త వాళ్ళే. అందులో తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కూడా తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. సహజంగా మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది. వాటిని దక్కించుకోవడం కోసం కిందా మీద పడుతుంటారు. ఎవరి లాబీలు వారు చేసుకుంటారు. కానీ ఈ సారి మాత్రం మంత్రి వర్గ కూర్పులో చంద్రబాబు భిన్నంగా వ్యవహరించారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు మంత్రి పదవులు కేటాయించారు. ఎన్‌ఎండి ఫరూక్, అచ్చెన్నాయుడు, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి వంటి సీనియర్లు ఉన్నా ఎక్కువగా కొత్త వాళ్లకే అవకాశం కల్పించారు.
చంద్రబాబు తన మంత్రి వర్గం ఏర్పాటు చేసిన నాటి నుంచి పని తీరును మెరుగు పరచుకోవాలని మంత్రులకు సూచిస్తూనే ఉన్నారు. కొంత మంది మంత్రులు దీనిని ఇప్పటికే అమలులో పెట్టగా మరి కొంత మంది మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగ లేదనే టాక్ ఉంది. శాఖల వారీగా అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆయా శాఖల ద్వారా ఏయే కార్యక్రమాలు అమలు జరుగుతోంది, వాటి ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయి, నిధులు ఎంత మేరకు ఉన్నాయి, ఎంత మేరకు ఖర్చు పెట్టారు, శాఖల్లో అధికారులు, ఉద్యోగుల పని తీరు ఎలా ఉంది వంటి అనేక అంశాలపై అవగాహన పెంచుకోవలసి ఉంటుంది. సీనియర్లకు ముందుగానే కాస్తా అవగాహన ఉంటుంది. తొలి సారిగా మంత్రులైన వారు ఈ రకమైన కార్యక్రమాలు విరివిగా చేపట్టాల్సి ఉంటుంది. ఒక పక్క ఇలా శాఖలపై పట్టు పెంచుకొంటూనే అటు ప్రజలకు, ఇటు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాల్సి ఉంది.
ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పని తీరు బాగా ఉందని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. తక్కిన వారు కూడా మెరుగు పరచుకోవాలని సూచించిన సీఎం చంద్రబాబు రానున్న రోజుల్లో మంత్రుల పని తీరు ఆధారంగా ర్యాంకులు కూడా ఉంటాయని మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు చెప్పినట్లు తెలిసింది.
ర్యాంకు పడి పోతే ఎలా?
ఈ నేపథ్యంలో మంత్రులపైన చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. వారికి కేటాయించిన శాఖలపైన ఎంత మేరకు అవగాహన ఉందనే దానిపై నేరుగా మంత్రులనే అడిగి తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా వారి పని తీరును ఎప్పటిప్పుడు చంద్రబాబు ఆరా తీసే పనికి కూడా ఉపక్రమించారు. సక్రమంగా సమీక్షలు నిర్వహిస్తున్నారా లేదా, అధికారులతో సక్రమంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే అంశాలను సంబంధిత శాఖల అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
దీనితో కొత్త మంత్రులు ఇబ్బంది పడుతున్నట్లు టాక్ కూడా ఉంది. ఒక పక్క స్వేచ్ఛ ఇచ్చినట్లే ఇచ్చి.. మరో పక్క రిమోట్ కంట్రోల్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతిలో పెట్టుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తమ అనుమతి లేకుండా ఎవరినీ పేషీలో ఉద్యోగాల్లోకి తీసుకోకూడదని, తాము సూచించిన వారినే ఓఎస్‌డీలగా నియమించుకోవాలని ఇది వరకే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మంత్రుల పేషీల్లోని ఉద్యోగులు, ఇతర సిబ్బందిని కూడా తాము సూచించిన వారినే తీసుకోవాలని మంత్రులదంరికీ అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఇప్పటికే కొంత మంది మంత్రులు నియామకాలు చేసుకోగా, మరి కొందరు అదే పనిలో ఉన్నారు. పూర్తి స్థాయిలో నియామకాలు పూర్తి అయిన తర్వాత వీరి సహాయంతో మంత్రుల కార్యకలాపాలపైన కూడా నిఘా పెట్టాలనే ఆలోచనలో కూడా వారు ఉన్నట్లు చర్చ సాగుతోంది.
దీంతో తమకు నచ్చిన వారిని పేషీలో ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని, పేరుకే మంత్రులమని, రిమోట్ కంట్రోల్ అంతా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల వద్ద ఉంచుకున్నారని మంత్రులు సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారనిటాక్ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు దక్కించుకున్నా సొంత ఇష్టాల ప్రకారం పనిచేయడం కుదరదని కొత్త మంత్రులు తొలిసారి గమనిస్తున్నారు. చంద్రబాబు క్రమశిక్షణకు అనువుగా మారకపోతే, కొలువులు ఊడినా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారు.
Next Story