ఆంధ్రలో భూ కంపం పై భయం.. భయం..
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని 12 గ్రామాల్లో భూమి వరుసగా కంపించడంపై అక్కడి ప్రజలు భయంతో బతుకుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయంతో వణికి పోతున్నారు. ఇండ్లలో ఎక్కువ సేపు ఉండేందుకు కూడా భయపడుతున్నారు. శని, ఆది, సోమ వారాల్లో భూమి కంపించింది. శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో, ఆదివారం 11.30 గంటల ప్రాంతంలో సోమవారం కూడా 11 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రెండేళ్లుగా వరుసగా ఆరు నెలలకు ఒకసారి ఈ ప్రాంతంలో భూమి కంపిస్తూనే ఉంది. ముండ్లమూరు నుంచి ఒంగోలుకు వయా చీమకుర్తి మీదుగా 30 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రాంత మంతా భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. శనివారం ఒంగోలు, ముండ్లమూరు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో భూమి కంపించింది. వారం రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లాలోని ఖమ్మం బార్డర్ గ్రామాలు, విజయవాడ నగరం, ఏలూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.
వరుస ప్రకంపనలతో భయం.. భయం..
భూమి వరుసగా కంపిస్తుండటంతో ముండ్లమూరు ప్రాంత వాసులు భయంతో ఉన్నారు. సోమవారం ముండ్లమూరు, వేంపాడు, నాయుడుపాలెం, మారెళ్ల, పోలవరం గ్రామాలతో పాటు ఆదివారం వచ్చిన అగ్రహారం, ఈదర, ఉమామహేశ్వరపురం, పూరిమెంట్ల, రమణారెడ్డిపాలెం, తుమ్మలూరు గ్రామాల్లో భూకంప ప్రభావం ఉంది. ఒంగోలు, చీమకుర్తి ప్రాంతాల్లో కూడా శనివారం కంపించడం వల్ల ఇదంతా భూకంప జోన్ గా మారిందనే అనుమానం స్థానికుల్లో ఉంది. ముండ్లమూరులోని ఒక ఎరువుల దుకాణంలో రూము గోడలు బీటలు బారాయి. ఆదర్శ పాఠశాలలో భూమి కంపించడంతో విద్యార్థినీ విద్యార్థులు భయంతో వణికి పోయారు. చాలా ఇళ్లలో భూమి కంపించింది. ఈ విషయమై అమరావతి (తాడేపల్లి)లోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆఫీస్ వారు ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజి (National center for seismology) వారిని సంప్రదించారు. వారిచ్చిన సమాచారం ప్రకారం రెక్టర్ స్కేల్ పై భూ కంప తీవ్రత నమోదు కాలేదు. అందువల్ల ఆ ప్రాంతానికి ఎటుంటి ప్రమాదం లేదని తేల్చారు. రెండు నుంచి మూడు సెకన్ ల పాటు కంపించినంత మాత్రాన ప్రమాదం ఉండదని అధికారులు చెబుతున్నారు.
గ్రానైట్ గనుల ప్రభావం ఉంటుందా?
చీమకుర్తిలో గ్రానైట్ కోసం భూములు భారీలోతుకు తవ్వకాలు జరుపుతున్నారు. కొన్ని వేల మీటర్లలోతులో తవ్వుతున్నందున దాని ప్రభావం భూమిపై పడే అవకాశం ఉందని భూకంపాలపై పరిజ్ఞానం ఉన్నవారు కొందరు చెబుతున్నారు. ఒంగోలు నుంచి చీమకుర్తి మీదుగా ముండ్లమూరు, అద్దంకి, బల్లికురవ వరకు గ్రానైట్ రాయి ఉన్నందున నెర్రెలు బారే అవకాశం ఉందని, దీని వల్ల కూడా భూమి కంపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులను ది ఫెడరల్ ప్రతినిధి ప్రశ్నిస్తే మూడు సెకన్ల పాటు వచ్చినందున భయపడాల్సిన అవసరం లేదన్నారు. రెక్టర్ స్కేల్ పై తీవ్రత నమోదైతే ఆలోచించాల్సిందేనని, అటువంటిదేమీ లేనందున ప్రజలు భయం వీడాలని అధికారులు చెబుతున్నారు. ముండ్లమూరు ప్రాంతంలో భూమి పదే పదే కంపించడానికి కారణాలు తెలుసుకునే పనిలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు ఉన్నారని డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు తెలిపారు.
ఆరుబయటే పండుకుంటున్న గ్రామస్తులు
రాత్రులు చలి ఎక్కువగా ఉన్నా గ్రామస్తులు ఆరు బయటే నిద్రిస్తున్నారు. వరుసగా మూడు రోజులు ఉదయం భూమి కంపించింది. అదే తెల్లవారు ఝామున కంపిస్తే పరిస్థితి ఏమిటనేది అక్కడి ప్రజల ప్రశ్న. అందుకే రాత్రులు ఇండ్లలో పండుకోకుండా ఇంటి ముందు పడుకుంటున్నామని ముండ్లమూరుకు చెందిన కె బ్రహ్మయ్య తెలిపారు. రెండేళ్ల నుంచి మాత్రమే ఈ పరిస్థితి వచ్చిందని, ఎందుకు ఈ విధంగా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నతాధికారులు దృష్టి పెట్టారని తెలిసింది. అయితే ముందుగానే పలానా కారణం అని చెబితే స్థానికులు భయపడిపోయే అవకాశాలు ఉన్నందున అటువంటివి ఇప్పటికిప్పుడు వల్లడించే అవకాశం లేదని ఏపీడిఎంఏ అధికారులు చెబుతున్నారు.