క్రూరమృగం కూడా తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుంది. వాటì జోలికి ఎవరొచ్చినా వెంటాడి చంపడానికైనా సిద్ధపడుతుంది. మానవ జాతిలో కన్న తండ్రి తన ఆడబిడ్డలను అంతకుమించి రక్షణగా నిలుస్తాడు. ఎవరినీ కన్నెత్తయినా చూడనివ్వడు. పెళ్లీడు వచ్చాక ఓ అయ్య చేతిలో పెట్టి హమ్మయ్యా! అంటూ నిట్టూరుస్తాడు. అందుకే తండ్రిని కూతుళ్లు రక్షణ కవచంలా భావిస్తారు. నాన్నపై ఉన్న భరోసాతో ఆ కూతుళ్లు నిర్భయంగా నిద్రిస్తారు. మరి అలాంటి నాన్నే నిద్రలో కాటేస్తాడని ఏ కూతురైనా కలగంటుందా? కలలో కూడా అలాంటి ఊహే రాదు. కానీ విశాఖలోని ఓ మానవ మృగం మరే తండ్రి ఒడిగట్టని దుశ్చర్యకు పాల్పడ్డాడు. లోకం పోకడ ఇంకా తెలియని కన్న కూతళ్లపైనే కన్నేశాడు. పట్టుమని పన్నెండేళ్లయినా నిండని తన ఇద్దరి కూతుళ్లను కాటేశాడు. దీనిపై నమోదైన కోసులో ఆ తండ్రికి ఇరవయ్యేళ్ల జైలు శిక్షను విధిస్తూ విశాఖపట్నం పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి తీర్పునిచ్చారు.
అసలేం జరిగిందంటే..
ఒడిశాకు చెందిన చిత్తరంజన్ పాత్రో అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం గతంలో విశాఖకు వచ్చాడు. అప్పట్నుంచి నగరంలోని ఆరిలోవ దుర్గాలమ్మ గుడి ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. పాత్రోకి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు 12 ఏళ్లు, చిన్న కుమార్తెకు ఎనిమిదేళ్ల వయసు. భార్య సుజాతనగర్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఫ్లోర్ ఇన్‌చార్జిగా పని చేస్తోంది. ఆమె రాత్రి వేళల్లో ఎక్కువగా విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తండ్రి పాత్రో తన ఇద్దరు కుమార్తెలను తన పక్కలో పడుకోబెట్టుకునేవాడు. ఆ క్రమంలో తొలుత పెద్ద కుమార్తెపై లైంగిక దాడికి తెగబడేవాడు. ఆ చిన్నారి భయంతో వద్దు నాన్నా! అని ఏడ్చినా విడిచి పెట్టేవాడు కాదు. పైగా తల్లికి గాని, బయట ఇంకెవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. కొన్నాళ్ల తర్వాత ఆ కసాయి తండ్రి కళ్లు చిన్న కుమార్తెపై కూడా పడ్డాయి. ముక్కు పచ్చలారని ఆ చిన్నారిపైనా అదే అకృత్యానికి తెగబడ్డాడు. కన్నతండ్రే ఈ దారుణానికి ఒడిగడుతుంటే తెలిసీ తెలియని వయసులోనూ ఆమె ప్రతిఘటించేది. అయినా ఆ దుర్మార్గుడు కన్న కూతుళ్లిద్దరినీ చెరబట్టడమే పనిగా పెట్టుకుంటూ వచ్చాడు. ఇద్దరు ఆడబిడ్డలు తండ్రి కర్కశత్వాన్ని భరించలేక నొప్పి నాన్నా.. వదిలేయ్ అంటూ వేడుకున్నా కనికరించే వాడు కాదు. తండ్రి అఘాయిత్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే చితకబాదేవాడు. ఈ విషయం బయటకు చెప్పారంటే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. మరో గత్యంతరం లేని ఆ పసికూనలు తండ్రి దాష్టీకాన్ని పంటి బిగువున భరిస్తూ వచ్చారు. చీకటి పడిందంటే చాలు.. తండ్రి ఎక్కడ తమ చెంతకు చేరిపోతాడోనని ఆ ఆడ బిడ్డలు తల్లడిల్లిపోయేవారు. ఎన్నో నిద్రలేని కాళరాత్రులు గడిపారు.
స్కూలు టీచరుకు ఫిర్యాదుతో..
ఇలా కన్నతండ్రి ఆగడాలను భరించలేని పెద్ద కుమార్తె తాను చదువుకుంటున్న పాఠశాల టీచర్‌కు వివరించింది. దీంతో ఆ టీచర్ గత ఏడాది సెప్టెంబర్ 24న ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దిశ పోలీసు స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ పెంటారావు దర్యాప్తు చేసి, నేరాభియోగ పత్రాన్ని కోర్టుకు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో గురువారం పోక్సో స్పెషల్ కోర్టు జడ్జి .. ఇద్దరు కూతళ్లను కాటేసిన కన్నతండ్రి చిత్తరంజన్ పాత్రోకు ఇరవయ్యేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. జైలు శిక్షతో పాటు ముద్దాయి రూ.3 వేల జరిమానా కూడా చెల్లించాలని, బాధిత బాలికలకు ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల పరిహారం అందజేయాలని జడ్జి ఆదేశించినట్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తి రాజశేఖర్ తెలియజేశారు.