కొడుకు శవంతో తండ్రి కన్నీటి నడక
x

కొడుకు శవంతో తండ్రి కన్నీటి నడక

విశాఖపట్నంలో మరో దారుణ ఘటన జరిగింది. మూడేళ్ల కుమారుడి మృతదేహాన్ని ఎత్తుకుని తండ్రి దాదాపు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు.


(శివరామ్)

విశాఖపట్నం: అల్లూరి సీతారామ రాజు జిల్లాలో మరో విషాద సంఘటన చోటుచేసుకొంది. రెండు రోజుల క్రితం విశాఖ మన్యంలో అంబులెన్స్ వెళ్లే దారి లోక నడుచుకుంటూ వస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే గర్భణి పురుడు పోసుకోగా, తాజాగా ఇప్పుడు అనారోగ్యంతో మరణించిన కొడుకు మృతదేహంతో తండ్రి ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకెళ్లి గ్రామానికి చేరవలసి వచ్చింది. రహదారి సౌకర్యం లేక మృతదేహంతో ఎనిమిది కిలోమీటర్లు బంధువులంతా నడుచుకుంటూనే వెళ్లారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రోంపిల్లి పంచాయతీ చినకొనేల నుండి గుంటూరు వద్ద కొల్లూరులో ఇటుకల పనికి గిరిజన కుటుంబం వలస వెళ్లింది.

సోమవారం సాయంత్రం అక్కడే అనారోగ్యంతో మూడేళ్ల బాలుడు మరణించాడు. మృతదేహంతో పాటూ బందువులను ఇటుక బట్టి యజమాని రహదారి సదుపాయం వున్న విజయనగరం జిల్లా వనిజ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. అక్కడి నుండి సరైన రహదారి లేకపోవడంతో మరణించిన కుమారుడి మృతదేహంతోనే తండ్రి, బంధువులు ఎనిమిది కిలోమీటర్ల దూరం మృతదేహంతో నడుచుకుంటూ గ్రామానికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గిరిజన సబ్ ప్లాన్ నిధులను మళ్లించకుండా కనీస వసతులలో భాగంగా రహదారులను నిర్మిస్తే ఈ దుస్థితి రాదని గిరిజన సంఘాలు మండి పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రహదారులను నిర్మించడం, అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని వనవాసి హక్కుల సంఘం నేత వి. మోహన రావు డిమాండ్ చేశారు.

Read More
Next Story