
కెసి కెనాల్, గుండ్రేవుల కోసం ఎప్రిల్ 19న ఆళ్లగడ్డలో ధర్నా
పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి గుండ్రేవుల సాధన, కేసి కెనాల్ పరిరక్షణ సమితి పిలుపు
కేసీ కెనాల్ (Kurnool-Cuddapah Canal) బ్రిటిష్ ఇండియా లోనే నిర్మాణం గావించబడిన అత్యంత పురాతనమైన ప్రాజెక్టు. కేసీ కెనాల్ ద్వారా కర్నూలు, కడప జిల్లాలో సుమారు 2.75 లక్షల ఎకరాలకు సాగు నీరు, త్రాగు నీరు లభిస్తుంది. తుంగభద్ర జలాల మీద ఆధారపడి నిర్మించిన ఈ ప్రాజెక్టు కర్నూలు కడప జిల్లాలకు వరప్రదాయిని. ఎగువన ఉన్న కర్నాటక రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికానన్ని సంవత్సరాలు, పంటకాలంలో నదిలో నీటి ప్రవాహం నిరంతరం ఉండడం వల్ల ఖరీఫ్, రభీ సీజన్ లలో కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు సులభంగా లభించేది.
ప్రకృతిలో మార్పుల వల్ల వర్షాల ద్వారా లభించే నీరు తగ్గక పోయినా, వర్షం కురిసే రోజులు తగ్గిపోయాయి. దీనితో వర్షం కుండపోతగా పడిన కొద్ది రోజులలో వచ్చే వరద జలాలను రిజర్వాయర్లలో నిలువ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఇదే సందర్భంలో తుంగభద్ర జలాలను పూర్తిగా వినియోగించడానికి అనేక ప్రాజెక్టులను ఎగువన కర్ణాటకలో నిర్మించడం వలన, కేసీ కెనాల్ ఆయకట్టుకు కేటాయించిన నీటిని నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కేవలం 1.2 టీఎంసీల సామర్థ్యంతో సుంకేసుల దగ్గర చిన్న రిజర్వాయర్ తోనే కే సి కెనాల్ ఆయకట్టుకు నీరు అందించడం కష్టమైంది.
కేసి కెనాల్ కు ఏ రోజు నుండి విడుదల చేస్తారో ప్రకటిస్తున్నారు, కాని ఏ రోజు వరకు నీరు విడుదల చేస్తారో ప్రకటించని పరిస్థితి ఏర్పడింది. గత 15 సంవత్సరాలుగా తుంగభద్ర నదిలో నీరు ఉన్నంతవరకు పంట పొలాలకు నీరు విడుదల చేస్తామని తీర్మానాలను సాగునీటి సలహా మండలి సమావేశాల్లో చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారింది అర్థమవుతుంది.
నీరు ఏ రోజు వరకు లభిస్తుందో తెలియక, మానసికమైన ఆందోళనలతో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు పంటలను పండిస్తున్నారు. ఆయకట్టు రైతులు పంటలు వేసుకొని పంట చివరి దశలో నీరు అందక పంటలు ఎండిపోయిన సందర్భంలో అనేకం ఉన్నాయి.
ప్రపంచ వారసత్వ సాగునీటి సంపదగా గుర్తింపు పొందిన కేసీ కెనాల్ పరిస్థితి అత్యంత దమనీయంగా మారింది.
ఈ నేపథ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి చేసిన పోరాటంతో 20 టి ఎం సి ల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయర్ (విశ్రాంత ఇంజనీరు సుబ్బరాయుడు గారు రూపొందించిన ప్రాజెక్టు రిపోర్ట్ ఆధారంగా) నిర్మాణానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతులను లభించాయి.
ఈ రిజర్వాయర్ నిర్మాణం ద్వారా కేసీ కెనాల్, ఎల్ ఎల్ సి, తెలంగాణలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు సక్రమంగా నీరు అందించే అవకాశం కలుగుతుంది. అంతే కాకుండా తుంగభద్ర పరివాహక ప్రాంతంలోని అనేక గ్రామాలతో పాటుగా కర్నూలు పట్టణానికి త్రాగునీటి అవసరాలు తీరుతాయి.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించిన ఈ రిజర్వాయర్ నిర్మాణానికి హక్కులు ఉన్నాయి.
ఈ రిజర్వాయర్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి 2018లో కర్నూలు నుండి గుండ్రేవుల వరకు రెండు రోజుల పాదయాత్రను విజయవంతంగా నిర్వహించింది.
2019 లో తెలుగు దేశం ప్రభుత్వం ఈ రిజర్వాయర్ కు శంకుస్థాపన గావించింది. గత ప్రభుత్వం గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని ప్రకటించినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
తెలుగు దేశం ప్రభుత్వం మరల అధికారంలోనికి వచ్చినా, ఈ రిజర్వాయర్ కు బడ్టట్ లో నిధులు కేటాయింపులు చెయ్యలేదు. ఏపీ అంటే అమరావతి పోలవరం అంటూ అన్ని నిధులు అక్కడే ఖర్చు పెడుతూ, ఆగమేఘాల మీద అక్కడ నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వం గుండ్రేవుల రిజర్వాయర్ అంశాన్ని మూలన పడేసింది.
గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని రాయలసీమ సమాజం ప్రశ్నించకుండా నివారించడానికి, కేవలం ప్రకటనలతో ప్రభుత్వం కాలం గడుపుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని ఆళ్లగడ్డలో ఏప్రిల్ 19 ధర్నాను నిర్వహిస్తున్నాము.
ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి పాలకులపై ఒత్తిడి పెంచే కార్యక్రమంలో ప్రతి రాయలసీమ వాసి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.