మంత్రి పెమ్మసానికి ముచ్చెమటలు పట్టించిన మందడం రైతులు
x
మృతి చెందిన రైతు రాములు కుమారుడు సుదర్శన్ తో మాట్లాడుతున్న మంత్రి చంద్రశేఖర్

మంత్రి పెమ్మసానికి ముచ్చెమటలు పట్టించిన మందడం రైతులు

మందడం రైతు రాములు కుటుంబానికి స్పష్టమైన హామీ ఇవ్వని ప్రభుత్వం, పరామర్శలకే పరిమితం.


కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు మందడం రైతులు ముచ్చెమటలు పట్టించారు. త్రిమెన్ కమిటీలో సభ్యులైన కేంద్ర మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శావణ్ కుమార్ లు నిర్వహించిన సమావేశంలో ఆవేదనకు గురైన గుండెపోటుతో దొండపాటి రాములు మృతి చెందారు. శనివారం ఆయన మృత దేహానికి నివాళులర్పించేందుకు చంద్రశేఖర్, ఆయనతో పాటు ఎమ్మెల్యే శావణ్ కుమార్ లు మద్యాహ్నం 1.30 గంటలకు వచ్చారు. దీంతో ఇంకా ఎంత మందిని చంపుదామని వస్తున్నారు. మీ సానుభూతి మాకొద్దు వెళ్లిపోండి. ఎమ్మెల్యేనే ఇదంతా చేస్తున్నారు అంటూ మంత్రిని నిలదీశారు.


ఇంకెంతమందిని చంపుదామని వచ్చారని రాములు ఇంటి వద్ద కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ను నిలదీస్తున్న రాములు బంధువు.

దీంతో ఆయన దండ చేత్తో పట్టుకుని చిన్నగా అడుగులు వేసుకుంటూ మృత దేహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఆవేశంతో మాట్లాడే వారికి మరికొందరు సర్థి చెబుతూ పక్కకు తీసుకు పోయారు. అనంతరం రోడ్డుపై వేసిన టెంటుకింద మంత్రి కూర్చుని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, మృతుడు రాములు కుమారుడు సుదర్శన్ లతో మాట్లాడారు. తప్పకుండా మీ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయినా రైతుల్లో ఆవేదన చల్లారలేదు.

మేము పచ్చని పంటలు పండే పొలాలు మీకు ఇచ్చాం. దీనికి మీరు మాకేమిచ్చారు. బురద గుటల్లో ఇంటి స్థలం ఇచ్చారు. మీరు ఆ గుంటల్లో కట్టుకుని ఉంటారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకున్న ఐదెకరాలు పొలం పూలింగ్ లో తీసుకున్నారు. ఇప్పుడు రోడ్డు నిర్మాణంలో ఇల్లు కూడా పోతోంది. ఇంటి స్థలం పూలింగ్ లో తీసుకున్న భూములకు ఇవ్వాలి. కమర్శియల్ ప్లాట్స్ ఇవ్వాలి. ఇంటి స్థలం ఎంత రోడ్డుకు పోతోందో అంత మాకు వేరే చోట ఇవ్వాలి. మీరు ఇచ్చింది ఎక్కడ బురద గుంటలో ఇదేంటి మందడం వాళ్లందరికీ ఇదే శారు. మాకు తీరని ద్రోహం చేశారంటూ రైతులు మంత్రి చుట్టూ కూర్చుని ఆవేశంగా మాట్లాడారు.


మానాన్న ఆవేదన అర్థం చేసుకోలేదని మంత్రితో అంటున్న రాములు కుమారుడు సుదర్శన్

మానాన్నది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నామని, ఆయన ఆవేదన బయటకు చెప్పినా మీరు పట్టించుకోకపోవడం వల్లనే చనిపోయాడని కుమారుడు సుదర్శన్ అనటంతో అక్కడి వారందరిలో విషణ్ణం నెలకొంది. అరగంట సేపు రాములు ఇంటి వద్ద గడిపిన చంద్రశేఖర్ స్థానిక నాయకులు చుట్టూ పెట్టుకుని ఇంటి నుంచి కారు వరకు నడిచి వెళ్లి కారెక్కి వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఉన్నారు. స్థానిక రైతు నాయకులపై కూడా మందడం రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో గ్రూపులుగా ఏర్పడి రైతులందరికీ నాయకులు అన్యాయం చేస్తున్నారని అక్కడికి వచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి నారాయణ పరామర్శ

కేంద్ర మంత్రి చంద్రశేఖర్ వెళ్లిన కొద్ది సేపటికి రాష్ట్ర మంత్రి పి నారాయణ వెళ్లి రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ సమయంలో కొందరు రైతులు మాదగ్గరికి రావొద్దు, ఎందుకొస్తున్నారు. ఇంకెంత మందిని చంపుదామని వస్తున్నారు... అంటూ పెద్దగా ఆవేదనతో కూడిన మాటలు మాట్లాడారు.

మంత్రి నారాయణ ఎదుట రైతుల ఆవేదన

మందడం రైతు రాములు మృతికి ప్రభుత్వ తీరే కారణమని ఆయన బంధువులు, ఇతర రైతులు మండిపడ్డారు. భూములు, ఇళ్లు కోల్పోతుండటంతో రైతులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు విన్నవించుకుంటూనే ప్రాణాలు వదలడం తమను కలిచివేసిందని, మృతుడి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

మంత్రి నారాయణ మాటలు

రైతు రాములు మృతి చెందడం అత్యంత బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే చర్చలకు వచ్చామని, కానీ ఇలాంటి విషాదం జరుగుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. రాములు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాములు కుటుంబ సభ్యులతో నారాయణ ముఖ్యమంత్రి చేత ఫోన్ లో మాట్లాడించారు. రాములు కుటుంబానికి సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపి వారికి ప్రభుత్వం నుంచి కావాల్సిన సాయం అందేలా చూడాలని మంత్రి నారాయణను ఆదేశించారు.

మందడంలో 147 ఇళ్ల తొలగింపు

రోడ్డు నిర్మాణం కోసం మందడంలోని గ్రామం మధ్యలో 147 ఇళ్లు తొలగించేందుకు సీఆర్డీఏ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు తూర్పువైపున తీసుకుంటే కేవలం ఇళ్లే పోతాయి. పడమటి వైపుకు మొగ్గితే ఐదు దేవాలయాలు కూడా తీసి వేయాల్సి వస్తుంది. దేవాలయాలకు ఇరు వైపుల రోడ్డు వేయాలంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పాలకులు ఉన్నారు.


మృతి చెందిన రైతు రాములు మృతదేహం వద్ద మంత్రి చంద్రశేఖర్

అందరికీ ఒకేచోట ఇళ్లు నిర్మించండి

రోడ్డు నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోతున్న మా అందరికీ మెరకభాగంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన కృష్ణనది వైపు తాళ్లాయపాలెం సమీపంలో ఇండ్ల పాట్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం వీరికి మూడు ప్రాంతాల్లో ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎక్కడ ఎంత మందికి ఇస్తారనేది చెప్పటం లేదు. ఒక చోట బురద గుంటల్లో ఇస్తున్నారు. మరో చోట ఎస్టీ కాలనీ వద్ద మునిగిపోయే ప్రాంతంలో ఇస్తామంటున్నారు. మా నుంచి మంచి భూములు తీసుకుని ఇవేమి ఆలోచనలు అని మంత్రులను స్థానికంగా ఇళ్లు కోల్పోయే వారు ప్రశ్నిస్తున్నారు.

స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

మృతి చెందిన దొండపాటి రాములు కుటుంబానికి కేంద్ర మంత్రి కానీ, రాష్ట్ర మంత్రి కానీ సీఎం చంద్రబాబు కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఆ కుటుంబానికి పరిహారంతో పాటు మెరక ప్రాంతాల్లో రెసిడెన్సియల్, కమర్శియల్ ప్లాట్లు ఇవ్వాలని కోరుతున్నారు. వారి కోరికను పరిశీలిస్తామన్నారే కాని స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో రైతుల్లో ఆవేదన మరింత పెరిగింది.

Read More
Next Story