ఒకనాటి టిటిడి ఆస్థాన నర్తకి  యామినీ కృష్ణమూర్తి మృతి
x

ఒకనాటి టిటిడి ఆస్థాన నర్తకి యామినీ కృష్ణమూర్తి మృతి

యామిని కృస్ణమూర్తి.. దేశమంతా పేనమోగిన పేరు. కాలికి గజ్జ కట్టి నృత్యం చేస్తే నృత్యం గురించి తెలియని వారు కూడా మంత్రముగ్దులై పోవాల్సిందే అన్నట్లు ఉంటుంది ఆమె నృత్యం.


యామిని కృష్ణమూర్తి.. నృత్య రంగంలో ఈ పేరు తెలియని వారుండరని చెప్పొచ్చు. కాలికి గజ్జ కట్టి నృత్యం చేస్తే నృత్యం గురించి తెలియని వారు కూడా మంత్రముగ్దులై పోవాల్సిందే అన్నట్లు ఉంటుంది ఆమె నృత్యం. భరతనాట్యం, కూచిపూడిలో ఆమెది అందెవేసిన చేయి. తన కళతో ఎన్నో జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారామే. అయితే ఆమె ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ రోజు సాయంత్ర ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మరణంపై ప్రముఖులెందరో సంతాపం తెలుపుతున్నారు. ఆమె మృతు నృత్య రంగానికి తీరని లోటని, భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్య కళకు ఆమె చేసిన సేవ ఎనలేనిదని అనేక మంది ఆమె ఖ్యాతిని గుర్తు చేసుకుంటున్నారు.

ఎవరీ యామినీ..

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్లాసికల్ డ్యాన్సర్ యామిని కృష్ణ మూర్తి.. 1940లో ఆంధ్రప్రదేశ్ మదనపల్లెలో జన్మించారు. భరతనాట్యం, కూచిపూడి నృత్య కళలో విశేష ప్రతిభను కనబరిచారు. ఆమె ప్రతిభకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కూడా పలు పురస్కారాలతో ఆమెను సత్కరించింది. యామిని కృష్ణమూర్తి.. 1968లో పద్మశ్రీ, 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2001లో పద్మ భూషణ్, 2016లో పద్మ విభూషణ్ ఇలా పలు జాతీయ అవార్డులను అందుకున్నారు.

భరతనాట్య నృత్యకారిణిగా యామిని కృష్ణమూర్తి.. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఎంతో పేరు తెచ్చారు. చిన్నప్పటి నుంచి నృత్యంపై ఉన్న మక్కువతో ఆమె నృత్యాన్నే తన జీవితంగా మలుచుకున్నారు. ఆమె పుట్టింది తెలుగునేలపైనే అయినా పెరిగింది మొత్తం తమిళనాడులోనే. ఓ శివాలయంలో ఉన్న నటరాజ విగ్రహాన్ని చూసి మైమరచిపోయిన ఆమె.. నాట్యం నేర్చుకోవాలని నిశ్చియించుకున్నారు. ఆ సంకల్పంతోనే రుక్మిణీ దేవి అరుండేల్ కళాక్షేత్రంలో నృత్యం అభ్యసించడం ప్రారంభించారు యామిని. అక్కడ నృత్యంలో ప్రాథమిక మెళకువలు నేర్చుకున్న తర్వాత ఆమె.. ప్రసిద్ధ ఎల్లప్ప పిళ్లై, తంజావూరు కిట్టప్ప పిళ్లై దగ్గర నృత్యాలు నేర్చుకోవడం కోసం కాంచీపురం వెళ్లారు. 1957లో తిరిగి చిన్నైకి చేరుకుని అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తన ప్రతిభతో అనతికాలంలో అద్భుతమైన గుర్తింపు పొందారు.

నృత్యమే కాదు గానంలో కూడా..

యామిని కృష్ణమూర్తి కేవలం నృత్య కళలోనే కాకుండా గాత్ర సంగీతం, వీణ వాయిండంలో కూడా శిక్షణ పొందారు. విభిన్న అభిరుచులు ఉన్నప్పటికీ ఆమె ప్రధానంగా భరతనాట్యం, కూచిపూడిపై దృష్టి సారించారు. ఈ నృత్య రూపాలను ప్రదర్శించి విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందారు. 1990లో ఢిల్లీలో సొంత డ్యాన్స్ స్టూడియో ‘యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ను ప్రారంభించారు. అక్కడ ఎంతో మందికి నృత్య కళను నేర్పించారు. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన నర్తకిగా కూడా ఉన్నారు. తన ప్రతిభతో కూచిపూడి కళకు టార్చ్ బేరర్‌గా మారారు. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది కూచిపూడి నృత్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపారు.

Read More
Next Story