
టీటీడీని జీఎస్టీ నుంచి మినహాయించండి
కేంద్ర ప్రభుత్వానికి సీపీఎం నేత కందారపు మురళి వినతి.
తిరుమల కొండపై జీఎస్టీ పన్నులను ఎత్తివేయాలని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ 22వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఈ చర్యను ప్రకటించాలని ఆయన కోరారు.
జీఎస్టీ సంస్కరణలలో విద్యారంగానికి జీరో శాతం ప్రకటించారని అదే మాదిరి తిరుమల ఆలయానికి జీరో శాతం జీఎస్టీని ప్రకటించడం ద్వారా భక్తులకు, యాత్రికులకు ఎంతగానో తోడ్పడుతుందని, ఆయా సంస్థల పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలవుతుందని కందారపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
టీటీడీ పాలకమండలి ఈ దిశగా ఆలోచించి అత్యవసర పాలక మండలి సమావేశం జరిపి కేంద్ర ప్రభుత్వానికి వినతిని సమర్పించాలని కోరారు.
గత ఐదేళ్లలో టీటీడీ జీఎస్టీ కింద 150 కోట్ల రూపాయలకు పైగా చెల్లించిందని, కేవలం 2024 సంవత్సరంలోనే రూ.50 కోట్ల వరకు ఈ పన్ను చెల్లింపు ఉందని స్వయంగా లోక్ సభలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తరపున మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించిన విషయాన్ని కందారపు మురళి గుర్తు చేశారు.
మతపరమైన అంశాలకు, ప్రసాదాలకు, వెయ్యి రూపాయలు లోపు అద్దె చెల్లించే కాటేజీలకు జీఎస్టీ వర్తించదని అంటూనే... తిరుమలలో తయారయ్యే లడ్డూ ప్రసాదానికి సరఫరా చేసే ముడి సరుకులపై భారీగా జీఎస్టీ విధిస్తున్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉచిత అన్నదాన పథకానికి కొనుగోలు చేసే ముడి సరుకులపై సైతం జీఎస్టీ విధిస్తున్నారని వివరించారు. ఈ చెల్లింపులు నేరుగా టిటిడి చెల్లిస్తున్న జీఎస్టీ కి అదనమని తెలిపారు.
కూటమి ప్రభుత్వం, పాలకమండలి, టీటీడీ యాజమాన్యం జీఎస్టీ మినహాయింపులు కోరుతూ యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేయాలని టిటిడి బోర్డులోని బిజెపి సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి తిరుమల కొండను జిఎస్టి రహిత ప్రాంతంగా ప్రకటించి భక్తులు, యాత్రికుల మన్ననలను పొందాలని కందారపు మురళి సూచించారు.
రోజుకో వివాదాన్ని తలకెత్తుకుని అనవసర చర్చలకు సమయం వృధా చేసుకోకుండా, ఇలాంటి అంశాలపై కేంద్రీకరణ చేస్తే సంస్థకు గరిష్టమైన ప్రయోజనాన్ని చేకూర్చిన వారవుతారని కందారపు మురళి టీటీడీ పెద్దలకు సూచించారు.
Next Story