'ఆర్ధిక ఉగ్రవాది' జగన్ బెయిల్ ను రద్దు చేయమన్న మాజీ మంత్రి యనమల
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఆర్ధిక మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ఆర్ధిక మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు. జగన్ ను ఆర్థిక ఉగ్రవాదంటూ విమర్శించారు. ఆయన బెయిల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 11 ఏళ్లుగా బెయిల్ పై ఉండడమేమిటని ప్రశ్నించారు. తల్లి విజయమ్మను, చెల్లి షర్మిలను కోర్టుకీడ్చి వైఎస్ జగన్ పాతాళంలో కూరుకుపోయారని రామకృష్ణుడు అన్నారు. జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా అథఃపాతాళంలోకే వెళతారన్నారు. "జగన్ మనస్తత్వం చాలా వికారమైంది. ప్రత్యేకించి ఇప్పుడు అతను ప్రవర్తించిన తీరు చాలా నీచమైందిగా ఉంది. కనబడడానికి అది ఆస్తుల వివాదంగా కనిపిస్తున్నా నిజానికి అది రాజకీయ ఆత్మహత్యే . చివరికి జగన్ తన సొంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారు. షర్మిలకు ఇచ్చిన రూ.200 కోట్లు ఆయనకు ఎక్కడివి. రూ.200 కోట్లు ఇచ్చానని పేర్కొన్నా.. ఐటీ, ఈడీ ఎందుకు స్పందించట్లేదు" అని ప్రశ్నించారు.
‘‘ఒక ఆర్థిక నేరస్థుడు 11 ఏళ్లుగా బెయిల్‌పై ఉండటమేంటి? ఇప్పటికే అనేక మంది వైసీపీని వీడుతున్నారు. భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం పగటి కలే. ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయం. పాత కేసులకు తోడు కొత్త కేసులు ఆయనపై సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు యనమల రామకృష్ణుడు.
జగన్ పై యనమల విరుచుకుపడడం ఇదేమీ కొత్త కాకపోయినా ఆయన ఈసారి డాక్టర్ వైఎస్సార్ భార్య విజయమ్మ, కుమార్తె షర్మిలను కోర్టుకు లాగడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రక్తం పంచుకుపుట్టిన చెల్లికి ఏదో మెహర్భానీగా ఇచ్చినట్టు ఆస్తులు ఇచ్చానని చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు.
Next Story