మొన్న కోడికత్తి శీను..నేడు డోర్‌డెలివరీ కేసు బాధితులు
x

మొన్న కోడికత్తి శీను..నేడు డోర్‌డెలివరీ కేసు బాధితులు

మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.


మాజీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనాలు సృష్టిస్తూ.. వైసీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ అయిన వైసీపీని ఎప్పటికీ అధికారంలోకి రాకుండా ‘నెవర్‌ అగెయిన్‌’ నినాదంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఇటీవల కోడికత్తి శ్రీనును, ఆయన కుటుంబాన్ని కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన డోర్‌డెలివరీ హత్య కేసులో బాధితులను సోమవారం కలిశారు. అన్యాయంగా బలైన ఈ రెండు కుటుంబాలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పని చేసిన సుబ్రహ్మణ్యం 2022 మే 20న హత్యకు గురయ్యాడు. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం డెడ్‌ బాడీని ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులోనే తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. డోర్‌ డెలివరీ హత్య కేసుగా ఈ కేసు ప్రాచుర్యం పొందింది. ఎమ్మెల్సీ అనంతబాబే డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే ఆరోపణలను డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, బంధువులు కూడా చేశారు.
మరో వైపు మాజీ ఐపీఎస్‌ అధికారి సోమవారం డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కలిసి, వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డోర్‌ డెలివరీ హత్య కేసులో చోటు చేసుకున్నంత లోపభూయిష్టమైన విచారణను తన 35 ఏళ్ల ఐపీఎస్‌ ఉద్యోగ జీవితంలో చూడలేదన్నారు. దళిత యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆలోచన లేకుండా నాటి ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు. కేసు వీగి పోయే విధంగా రిపోర్టులు తయారు చేసి ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌కు, చార్జిషీట్‌కు సంబంధం లేదు. ఈ కేసులో మధ్యవర్తులు, కుటుంబ సభ్యులు చెబుతున్న దానికి, ఎస్సీ స్థాయిలో ఉన్న పోలీసు అధికారి చెబుతున్న వాదనలకు పొంతన కుదరడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ కేసు పట్ల చాలా అన్యాయం వ్యవహరించారు. చార్జిషీటు దానింతట అదే వీగిపోయే విధంగానూ, హత్య కేసును కొట్టి వేసే విధంగానూ నీరుగార్చారు. చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు వ్యవహరించిన తీరు ఇది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు చరిత్రలో ఓ మచ్చగా నిలిచిపోయే దర్యాప్తు ఇది అంటూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.
ఇంత అన్యాయం చోటు చేసుకున్న ఈ డోర్‌ డెలివరీ హత్య కేసులో న్యాయస్థానం అనుమతి తీసుకొని, ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి, మళ్లీ మొదటి నుంచి తిరిగి దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీని గురించి కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయడానికి తాను వచ్చినట్లు ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. కాకినాడలో ఓ అపార్ట్‌మెంట్‌లో పని చేసుకుని జీవనం సాగించే ఈ దళిత కుటుంబం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్ల, నాటి వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల, వారి బెదిరింపులకు భయపడి ఒక మారుమూల పల్లెలో నాలుగు ఇళ్లల్లో పాచిపనులు చేసుకుని బతికే దుస్థితి నెలకొంది. ఎంతో అన్యాయానికి గురైన ఈ కుటుంబానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి అంటూ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడారు.
Read More
Next Story