‘చేసిన తప్పులను మరిచి ఈవీఎంలపై పడకండి’
x

‘చేసిన తప్పులను మరిచి ఈవీఎంలపై పడకండి’

జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్షణరెడ్డి : ఓడిపోయిన పార్టీల అభ్యర్థులు తమ తప్పులు తెలుసుకోకుండా ఈవీఎంలవల్లే ఓడిపోయామని ఓటర్లను నమ్మించాలనుకుంటున్నారు.


ఆంధ్రలో ఈవీఎంల రభస జోరుగా జరుగుతోంది. తాజాగా న్యాయం జరిగినట్లు చూపించడం కాదని, నిజయంగా న్యాయం జరగాలంటూ ఈవీఎంలను ఉద్దేశించి మాజీ సీఎం వైఎస్ జగన్ ఓ ఎక్స్(ట్వీట్) పోస్ట్ పెట్టారు. అది కాస్తా రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారి తీసింది. టీడీపీ నేతలు సైతం జగన్‌కు ఘాటుగా బదులిస్తున్నారు. మీకు 151 వస్తే విజయం.. మాకు 164 వస్తే మోసమా అని, పులివెందులలో జగన్ రాజీనామా చేస్తే ఎన్నికల సంఘాన్ని ఉపఎన్నికల కోరదాం అంటూ టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. తాజాగా ఈ వ్యవహారంపై జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కూడా కాస్తంత ఘాటుగా స్పందించారు. మీరు చేసిన తప్పులను మర్చిపోయి ఓటమికి ఈవీఎంలు కారణమంటా వాటిపై పడటం ఏమాత్రం సమంజసం కాదని హితవు పలికారు.

జగన్ మాటలు విడ్డూరం

‘‘తన ఐదేళ్ల పాలనలో జగన్ వందకుపైగా తప్పులు చేశారు. వాటన్నింటిని విస్మరించి ఎన్నికల్లో వైసీపీ ఓటమి వెనక ఈవీఎం పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో పేపర్ బ్యాలెట్ లను ఉపయోగిస్తున్నారని, మనదేశంలో కూడా ఇ వి యం లను వినియోగించటం ఆపి, పేపర్ బ్యాలెట్ లను వినియోగిస్తే, ప్రజాస్వామ్యం వికసిస్తుందని ఎన్నికల ఓటమి తర్వాత వైయస్.జగన్ మోహన్ రెడ్డి పేర్కొనటం విడ్డూరంగా ఉంది. సుపరిపాలన, అభివృద్ధి, ఉపాధి కల్పన లాంటి సమస్యలను పక్కనపెట్టి రూ.2.70 లక్షల కోట్లు నగదు బదిలీ చేయడం ద్వారా ఎన్నికలలో విజయం సాధిస్తామనే నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వమ్ము చేసి దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు గుణపాఠం నేర్పారు’’ అని స్పష్టం చేశారు.

‘‘100 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న భారతదేశంలో ఈవీఎంలు పారదర్శక ఎన్నికలకు అవకాశం ఇస్తుంది. వీటితో అతి తక్కువ ఖర్చుతో ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. పోలింగ్ బూత్ ఆక్రమణ, రిగ్గింగులకు ఆస్కారం లేకుండా చేయడంలో, ఎన్నికల ఫలితాలను త్వరగా అందించడంలొ ఈవీఎంలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అలాంటి ఈవీఎంలను తిరస్కరించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరడం సరికాదు. గత 25 సంవత్సరాల నుండి ఓడిపోయిన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ తప్పులను సరి చేసుకోవడం మానేసి ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే తాము ఓడిపోయామంటూ ఓటర్లను నమ్మిస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘భారత ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1977లో మొదటిసారి ఈవీఎంను రూపొందించింది. 1989లో పార్లమెంట్ 1951 ప్రాతినిధ్య చట్టాన్ని సవరణకు తీసుకురావడం ద్వారా భారతదేశ ఎన్నికలలో ఈవీఎం వినియోగానికి మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈవీఎం అనుసంధానంగా ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్‌ను (వీవీప్యాట్) చేయటం వల్ల ఓటర్‌కు, రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఈవీఎంలపై నమ్మకం, విశ్వాసం పెరిగింది’’ అని గుర్తు చేశారు.

‘‘వీవీప్యాట్ ద్వారా ఓటరు వేసిన అభ్యర్థికి సంబంధించి పార్టీ గుర్తు స్క్రీన్ పై ఏడు సెకండ్లు కనపడి స్లిప్‌గా వివిప్యాట్ బాక్స్‌లో భద్రంగా ఉంటుంది. 2004 నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలలో ఈవీఎంలకు వివిప్యాట్‌లను అనుసంధానం చేసి ఎన్నికలు నిర్వహించడం జరుగుతోంది’’ అని వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు.

ఈవీఎం ట్యాంపరింగ్ సాధ్యం కాదు

‘‘ఇంటర్నెట్, విద్యుత్‌తో సంబంధం లేకుండా కేవలం బ్యాటరీతో పనిచేస్తున్న ఈవీఎంలను ట్యాపర్ చేయటం సాధ్యం కాదు. జన చైతన్య వేదిక అధ్యక్షుడిగా నేను సుప్రీంకోర్టులో ఈవీఎంలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన సందర్భంలో సుప్రీంకోర్టు తమ తీర్పుతో అన్ని ఈవీఎంలకు వీవీప్యాట్లను అనుసంధానం చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను జాతీయ ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికలలో అమలు చేయడం ప్రారంభించింది. తద్వారా ఎన్నికలలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని, పారదర్శకతను చూపింది. ఇప్పటికైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆత్మ పరిశీలన చేసుకుని తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి’’ అని కోరారు.

Read More
Next Story