
YS Jagan, YV subbareddy
వైఎస్ కుటుంబంలో ఇవాళ అన్నీ సంచలనాలే!
అటు సిట్, ఇటు సీబీఐ, మధ్యలో చెల్లి..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో నవంబర్ 20న మూడు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ యాదృచ్చిక సంఘటనలే అయినా ఇవి అందరి నోళ్లల్లో చర్చనీయాంశాలుగా మారాయి. బాబాయి, అబ్బాయి, తల్లీ, చెల్లీ అంటూ సెటైర్లు పేలాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు ఆరేళ్ల తర్వాత హైదరాబాద్ కోర్టుకు వచ్చి హాజరైనట్టు రికార్డుల్లో సంతకం చేయడం ఒకటి కాగా తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో వైఎస్సార్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించడం. ఇక ముచ్చటగా మూడోది సీబీఐ కోర్టులో వరసకు అన్నా చెల్లలు వరసయ్యే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్ ఎదురెదురుపడడం. కొసమెరుపుగా చెప్పుకోవాల్సి వస్తే మరోకటి కూడా ఉంది. ఎడమొహం పెడమొహంగా ఉంటున్న తల్లీకొడుకులు వైఎస్ జగన్, విజయమ్మలు ఆత్మీయంగా లోటస్ పాండ్ లోని ఇంట్లో ఆత్మీయంగా పలకరించుకోవడం.
జగన్ రాక, అభిమానుల కోలాహలం..
ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో జగన్ (YS Jagan) హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన నాంపల్లిలోని కోర్టుకు హాజరై రికార్డుల్లో సంతకం చేశారు. విచారణ అనంతరం జగన్ అక్కడి నుంచి లోటస్‌పాండ్‌కు వెళ్లిపోయారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మరో ఇద్దరు నాయకులు కోర్టులోకి పోవడానికి ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు గేట్ వద్దే ఆగిపోయారు.
ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్‌పై ఉన్నారు. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు.
కేవలం ఐదు నిమిషాలు మాత్రమే జగన్ కోర్టు హాల్‌లో కూర్చున్నారు. న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా 'మీరేమైనా చెప్పదల్చుకున్నారా?' అని జగన్‌ను సీబీఐ కోర్టు న్యాయమూర్తి అడిగారు. అందుకు జగన్ తరఫు న్యాయవాది నో అని జవాబు చెప్పారు. ఆపై జగన్ వ్యక్తిగత హాజరును న్యాయస్థానం రికార్డు చేసింది. అటెండెన్స్ పూర్తి అయిన తరువాత కోర్టు నుండి జగన్ బయటకు వచ్చి లోటస్ పాండ్ లోని తన స్వగృహానికి వెళ్లి వాళ్లమ్మ విజయమ్మను కలిశారు.
జగన్ రాక సందర్భంగా హైదరాబాద్ లో రఫ, రఫా ఫ్లేక్సీలు వెలిశాయి. అభిమానులు కేరింతలు కొట్టారు.
వైవీ సుబ్బారెడ్డి ని విచారిస్తున్న సిట్ అధికారులు..
కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఏపీ సిట్ అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నను సిట్ విచారించింది. అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బారెడ్డిని మరింత లోతుగా విచారిస్తున్నట్టు సమాచారం.
భోజన విరామానికి గంట సమయం ఇచ్చి సాయంత్రం మళ్లీ విచారణ మొదలుపెట్టారు.
ఎదురెదురుపడ్డ జగన్, సునీత..
జగన్, ఆయన బాబాయి వైఎస్ వివేకా కుమార్తె సునీత ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ఎదురెదురుపడ్డారు. అయినా ఒకర్నొకరు పలకరించుకోలేదు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించే పిటిషన్‌పై వాదనల నేపథ్యంలో సునీత నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వచ్చారు.
అదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు జగన్ కూడా అక్కడికి వచ్చారు. కోర్టులో ఒకర్నొకరు చూసుకున్నారు. అటు సునీత గాని ఇటు జగన్ గానీ పలకరించుకోకుండానే ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరూ ఒకేసారి కోర్టుకు హాజరుకావడం, మాట్లాడుకోకపోవడం గురించి కాసేపు కోర్టులో మూగిన జనం చర్చించుకోవడం గమనార్హం. రక్తసంబంధాలు ఉత్త బూటకమేనంటావా? అని కొందరు వ్యాఖ్యానించారు.
Next Story

