
బెయిలొచ్చినా..పోలీసుల కస్టడీకి పోసాని
రెండు రోజుల పాటు పోసానిని పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కీలక తీర్పును వెల్లడించిన కోర్టు.
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి పోలీసుల కేసులు ఇప్పట్లో తప్పేట్టు లేదు. ఓ పక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ పోసానికి కాస్త ఊరట కలిగించినా.. పోలీసు కస్టడీ మాత్రం తప్పడం లేదు. ఒక కేసులో బెయిల్ వచ్చిందని సంతోష పడేలోగా మరో కేసులో పోలీసు కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో పోసానికి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలకు పాల్పడ్డారని పోసాని కృష్ణమురళి మీద రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పల్నాడు జిల్లా పోలీసులు పోసానిపై కేసు నమోదు చేశారు. నరసరావుపేట టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు. దీంతో రాజంపేట సబ్‌జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్ మీద నరసరావుపేట పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు అతనని విచారించారు. తర్వాత నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు పోసానికి ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో పోసానిని కస్టడీకి అప్పగించాలని నరసరావుపేట పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైన శుక్రవారం విచారణ చేపట్టింది. రెండు రోజుల పాటు పోసానిని పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో నరసరావుపేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకొని శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు విచారణ చేపట్టనున్నారు.
రైల్వేకోడూరు పోసానిని విచారణ చేపట్టిన సమయంలో కీలక అంశాలను వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా ఉన్న ఆయన కొడుకు సజ్జల భార్గవ్‌రెడ్డి సూచనలు, స్క్రిప్ట్ మేరకు తాను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడానని, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో తండ్రీ కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డిలు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి పోలీసుల విచారణలో పోసాని ఎలాంటి వివరాలను వెల్లడిస్తారో, అవి ఎవరి మెడకు చుట్టుకుంటాయో అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలవరం పట్టుకుంది.
Next Story